Jul 28,2021 21:20

- ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
టెక్సాస్‌ :
టెక్సాస్‌ రాష్ట్రంలోని లా పోర్ట్‌ సముదాయంలో కెమికల్‌ ప్లాంట్‌ లీకేజీ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. హ్యూస్టన్‌కి సమీపంలోని లాండెల్‌బేసెల్‌ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అసిటిక్‌ యాసిడ్‌ లీకైందని, విషమంగా వున్న ఒకరిని విమానంలో ఆస్పత్రికి పంపినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. మరో ఐదుగురికి సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించామన్నారు. శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు, మంటలు వంటివి వుండడంతో పలువురిని పరిశీలనలో వుంచినట్లు తెలిపారు. లీకేజీ ఎక్కడ, ఎలా అయిందో నిర్ధారిస్తే తప్ప ప్రమాద కారణాలు పూర్తిగా తెలియవని కంపెనీ ప్రతినిధి చెప్పారు. సమీప ప్రాంతాల వారి పరిస్థితికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే వుందని చెప్పారు.