May 28,2023 22:23

నివాళులు అర్పిస్తున్న అప్పలసూర్యనారాయణ

-మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ
- ఘనంగా శత జయంతి వేడుకలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కీర్తిశేషులు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. ఎన్‌టిఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని టిడిపి శ్రేణులు ఆదివారం పలు కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని ఏడు రోడ్ల కూడలి, సూర్యమహల్‌ కూడళ్లలో ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్‌టిఆర్‌ అభిమాన సంఘాల ఆధ్వర్యాన అప్పలసూర్యనారాయణ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో విశ్వ విఖ్యాత నటుడిగా పేరుగాంచిన ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదారపు వెంకటేష్‌, చిట్టి నాగభూషణావు, ఉంగటి రమణ, గుత్తు చిన్నారావు, వెంకన్న యాదవ్‌, విబూది సూరిబాబు, గుప్త, దుంగ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.