Jun 02,2023 00:30
మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ నాయకులు దివి రాంబాబు

ప్రజాశక్తి-రేపల్లె: తెలుగుదేశం పార్టీలోనే బిసిలకు గుర్తింపు ఉందని టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ ఉపాధ్యక్షులు దివి రాంబాబు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వల్లే రాష్ట్రంలో బిసిలకు గుర్తింపు వచ్చిందని అన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించటంవలన అనేక మంది బిసిలు రాజ్యాధికారం పొందారని చెప్పారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్లుగా మున్సిపల్‌ చైర్మన్లుగా ఎంపిటిసి, జడ్పిటిసి, కార్పొరేటర్లుగా, సర్పంచ్‌, కార్పొరేటర్లుగా వేలాది మంది ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం నుంచి బిసిలను వేరుచేసే కుట్రలు చేస్తూ రాష్ట్రంలో 620 మందిపై దాడులు చేశారని అన్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర కూడా ఉన్నారని తెలిపారు. అనేకమంది బిసి నాయకులను హతమార్చారని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో అందరికీ లబ్ధి చేకూరేలా ప్రవేశ పెట్టిన ముందస్తు మానిఫెస్టోలో బిసిల రక్షణ కోసం ఒక చట్టం తీసుకొస్తామని ప్రకటించటం అభినందనీయం అన్నారు. బిసిల రక్షణ చట్టం గురించి వాడవాడల ప్రచారం చేసేందుకు త్వరలో ప్రణాళికాబద్ధంగా అన్నిగ్రామాలలో పర్యటిస్తామని తెలిపారు. సమావేశంలో పద్మశాలి సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు తాడిపర్తి మల్లిఖార్జునరావు, వడ్డెర సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు గోపిరాజు, ఇతర బిసి సంఘ నాయకులు పాల్గొన్నారు.