Jan 23,2022 08:56

ప్రజాశక్తి-అమరావతి : హైకోర్టులో మాతృ భాషలో వాదించిన ఒక కేసులో రూ.25 వేలు జరిమానా విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. మాతృ భాషలో చెబితే కోర్టుల స్థాయి తగ్గిపోదని గుర్తు చేసింది. విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ అనుమతుల అంశంపై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌ జడ్జి ఎదుట ఇంగ్లీషులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు పిటిషనరు తరపున న్యాయవాది కల్పించుకుని ఫలానా పేజీలు చూడండి.. అని తెలుగులో జవాబు చెప్పారు. కేసు బండిల్‌లోని 18, 19 పేజీలు చూడాలని న్యాయవాది తెలుగులో వాదనలు చేయడంపై సింగిల్‌ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 వేలు జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్‌ చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను రద్దు చేస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.