May 17,2022 23:03

దొంగ బంగారంతో రుణాలు - బ్యాంకు మేనేజర్‌, అప్రైజర్‌ పాత్రపై అనుమానాలు
ప్రజాశక్తి - తెనాలి

పట్టణంలోని చెంచుపేట జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జిడిసిసిబి)లో భారీ అవకతవకలు వెలుగు చూశాయి. దొంగ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రూ.లక్షల కొద్దీ రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. బ్యాంక్‌ సీఈవో కృష్ణవేణి, జిఎం శేషాభానురావు సంయుక్తంగా మంగళవారం ఉదయం నుంచి చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. వీటిపై సిఇఒ కృష్ణవేణి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా బ్యాంకు నోడల్‌ ఆఫీసర్‌ ఇటీవల బ్యాంకును తనిఖీ చేశారని, 10 ఖాతాలను పరిశీలించగా కొన్ని దొంగ బంగారం కేసులు వెలుగు చూశాయని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు తాము తనిఖీలు చేపట్టామని, మరో రెండ్రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అన్నారు.
మంగళవారం మొత్తం 29 ఖాతాలు పరిశీలించగా రూ.42. లక్షల దొంగ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి లోతైన విచారణ జరుగుతుందన్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌, గోల్డ్‌ అప్రైజర్‌ ఇద్దరూ కుమ్మక్కై ఈ ఘటనకు పాల్పడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బ్యాంక్‌ పాలకవర్గ దృష్టికి తీసుకెళ్లామనానరు. దీనిక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, సొమ్మును రికవరీ చేయడంలో వివక్షేమీ ఉండదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కుంభకోణం రూ.కోటి వరకు ఉండోచ్చనే అంచనాలు వినవస్తున్నాయి.