Jan 18,2022 20:34

తిరుపతిలో శ్రీకాంత్‌కు ఐదెకరాల స్థలం కేటాయింపు
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌, విశాఖపట్నం :క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జోనల్‌ స్థాయి టెన్నిస్‌ రిపబ్లిక్‌ డే కప్‌ టోర్నమెంట్‌ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జోనల్‌ టెన్నిస్‌ టోర్నీని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో సిఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకే ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు కిడింబి శ్రీకాంత్‌కు తిరుపతిలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించామని, ఈ మేరకు తిరుపతి కౌన్సిల్లోనూ ఆమోదం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్విన్‌ సిఇఒ మురళీకృష్ణ, శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పరిపాలనాధికారి జయరామయ్య, డిఎస్‌సి చీఫ్‌ కోచ్‌ బాలాజీ పాల్గన్నారు. విశాఖ జివిఎంసి టెన్నిస్‌ కాంప్లెక్సులో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జివిఎంసి అదనపు కమిషనర్‌ వై.శ్రీనివాసరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజరుమోహన్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటరావు, శాప్‌ డైరెక్టర్‌ జన్నాడ శ్రీనివాసరావు, సోషల్‌ వెల్పేర్‌ జెడి డివి.రమణమూర్తి తొలి ఆట ఆడి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో జరగనున్న నేపథ్యంలో జోనల్‌ స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు డిఎస్‌డిఒ ఎన్‌.సూర్యారావు తెలిపారు.