
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర మాట్లాడుతూ పిఆర్‌సి జిఒల్లో ఉన్న లోపాలను సవరించాలని, ఎప్పటి నుంచో అమలవుతున్న స్పాట్ రేట్లను వెంటనే పెంచాలని, జిపిఎస్ కాకుండా, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 11 పేపర్లు ఉండేవని, నాటి రేట్లను ఇప్పుడు అమలు చేస్తున్నారని అన్నారు. 11 పేపర్లను ఇప్పుడు ఏడు పేపర్లకు కుదించారని, వంద మార్కులకు పేపరును పెట్టారని, తద్వారా పని భారం పెరిగిందని అన్నారు. పెరిగిన పనిభారం మేరక స్పాట్ డిఎ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం అమలు నిలిపివేయాలని, విద్యా వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు మాట్లాడుతూ మాట తప్పం మడమ తిప్పం అని చెప్పిన ప్రభుత్వం సిపిఎస్ విషయంలో మాట తప్పిందని, వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేయాలని, స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచాలని కోరారు. ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుభాష్‌బాబు మాట్లాడుతూ వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఈ రోజుకూ రద్దు చేయకపోవడం దారుణమన్నారు. పాత పెన్షన్ విధానాన్ని సత్వరమే అమలు చేయాలని, 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం నిలుపుదల చేయాలని, పిఆర్‌సి ఉత్తర్వులను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు పేడాడ ప్రభాకరరావు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, ఉపాధ్యా యులకు ప్రమోషన్లు కల్పించాలని, సర్వీస్ నిబంధనలను పునరుద్ధరించి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎపిటిఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపపరిష్కృత సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, ఎస్‌టియు ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనివాస పట్నాయక్, ఎపిటిఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు వాన కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు, ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డేనియల్, బిటిఎ సంఘం బాధ్యులు తాతారావు, ఫ్యాప్టో కార్యకర్తలు దాసరి రామ్మోహన్‌రావు, చావలి శ్రీనివాస్, సదాశివుని శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.