పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి నిమ్మల, ఎంఎల్‌ఎలు, కలెక్టర్‌ప్రజాశక్తి – పాలకొల్లు చరిత్రలో ముషారఫ్, హిట్లర్ కూడా జగన్ అంత దారుణంగా నియంత పాలన చేయలేదని, అందుకే ప్రజలు జగన్‌ను 11 సీట్లకే పరిమితం చేశారని, జిల్లాలోని పేదవారి ఆకలి తీచ్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున పాలకొల్లులో అన్నా క్యాంటీన్‌ను మంత్రి పున్ణప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నా క్యాంటీన్‌లను జగన్ పాలనలో ధ్వంసం చేశారని, అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. భవన, ఆటో కార్మికులు అన్నాక్యాంటీన్ వంటి చోట కడుపునిండా భోజనం చేయకూడదని జగన్ భావించి వాటిని మూసివేశారని తెలిపారు. పట్టణాలకు వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో ఆధునిక భవంతుల్లో మంచి భోజనం చేయాలనే సదుద్దేశంతో టిడిపి అన్నాక్యాంటీన్లు నెలకొల్పినట్లు చెప్పారు. పాలకొల్లులో అన్నా క్యాంటీన్లు మూసి ఐదేళ్లు అయినా దాతల సహకారంతో ఇప్పటి వరకూ నడిపామని, ఇక ముందు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల కోసం నడుపుతామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారధి, టిడిపి, బిజెపి, జనసేన నేతలు పాల్గొన్నారు. భీమవరం :జిల్లాలోని పేదవారి ఆకలి తీచ్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడు క్యాంటీన్లను భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాలకు పేదలు వైద్యం, విద్య వంటి పనుల కోసం వస్తుంటారని, వారు ఎక్కువ ఖర్చు పెట్టి ఆహారం కొనలేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఎంఎల్‌ఎ రామాంజనేయులు మాట్లాడుతూ సామాన్యులందరికీ రూ.5లకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అన్నా క్యాంటీన్లలో అందించడం జరుగుతోందని తెలిపారు. పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి, ఎంఎల్‌ఎ అంజిబాబు, మాజీ రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి ప్రజలకు అల్పాహారం వడ్డించి వారితో కలిసి ఆహార పదార్థాలను రుచి చూశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.శ్యామల, టిడిపి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, గాదిరాజు తాతారాజు, ఎద్దు ఏసుపాదం, గంటా త్రిమూర్తులు, విజ్జురోతి రాఘవులు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు ఒకసారి అన్నా కాంటీన్‌కు వచ్చి భోజనం చేయాలని ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక తాలూకాఫీస్ సెంటర్, బలుసులమ్మ గుడి, కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మూడు అన్నా క్యాంటీన్లను ఆయన శుక్రవారం ప్రారంభి మాట్లాడారు. తాడేపల్లిగూడెంలోని మూడు అన్నా క్యాంటీన్లలో 1050 మందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజనం కూడా అందించేందుకు అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాయని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూట క్యాంటీన్ కయ్యే 10,500 రూపాయలను ఆయన మున్సిపల్ కమిషనర్‌కు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి ఇన్‌ఛార్జి వలవల బాబ్జి, మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ పాల్గొన్నారు.తణుకు : పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఎన్‌టిఆర్ స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు పున్ణప్రారంభిస్తున్నట్లు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు సొసైటీ రోడ్డులో ఆధునికీకరించిన భవనంలో అన్నాక్యాంటీన్ ప్రారంభించారు. అల్పాహారంతో ప్రారంభమైన క్యాంటీన్లో ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందించనున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి కడుపు కొట్టిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గత పాలకుల దుర్మార్గపు ఆలోచనలతో మూసివేసిన అన్నా క్యాంటీన్లను తణుకులో 450 రోజులకుపైగా, అత్తిలిలో 550 రోజులకు పైగా దాతల సహకారంతో వాటిని దిగ్విజయంగా కొనసాగించిన అత్తిలి మండల అధ్యక్షులు ఆదినారాయణ, తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, భీమనాదం వెంకట సుబ్బారావు, పచ్చిపాల కృష్ణమూర్తిను సత్కరించారు. అనంతరం పేదలతో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి నిమ్మల, ఎంఎల్‌ఎలు, కలెక్టర్ ప్రజాశక్తి – పాలకొల్లు చరిత్రలో ముషారఫ్, హిట్లర్ కూడా…