Oct 27,2021 20:39

టాప్‌లోనే మలాన్‌
దుబాయ్: ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ టాప్‌ా10లో మాత్రమే చోటు దక్కించుకోగలిగారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి అర్థసెంచరీ సాధించినప్పటికి ఒకస్థానం దిగజారి 725 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు దిగజారి 684 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 40, 51(నాటౌట్‌) పరుగులతో రాణించి ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 743పాయింట్లతో మూడోస్థానానికి చేరుకొని కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టీమిండియాతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ, న్యూజిలాండ్‌పై 33 పరుగులు చేసి మూడుస్థానాలు ఎగబాకి 727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. డేవిడ్‌ మలాన్‌(ఇంగ్లండ్‌) 831 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 820 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ షాంసీ 750 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. శ్రీలంక బౌలర్‌ వనిందు డిసిల్వా(726 పాయింట్లు), ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(720 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.