Apr 07,2021 20:27

ప్రజాశక్తి-యంత్రాంగం : పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ టిడిపి అధినాయకత్వం మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి, నిరాశకు గురిచేసింది. కొంతమంది టిడిపి నేతలు ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించి పోటీలో కొనసాగుతున్నారు. తక్కిన చోట్ల తమ ఓట్లను ఎవరికి వేయాలో తెలియక, అసలు ఓటింగ్‌లో పాల్గనాలో, పాల్గనకూడదో అర్థం కాక టిడిపి ఓటర్లు అయోమయంలో పడ్డారు. టిడిపి బహిష్కరణ ప్రభావం ఓటింగ్‌ సరళిపై ఏ మాత్రమూ ఉండబోదని వాదిస్తోన్న అధికార పార్టీ నేతలు గ్రామ సచివాలయ సిబ్బందినంతటినీ రంగంలోకి దించి, ప్రతి ఓటరునూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గనాలని గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల బరి నుంచి టిడిపి తప్పుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి, జనసేన పార్టీకి బలమైన పునాది లేకపోవడంతో తమకు ఏకపక్ష ఫలితాలు వస్తాయని వైసిపి శ్రేణులు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మారిదిగానే క్లీన్‌ స్వీప్‌ చేస్తామని చెప్తున్నాయి. అయితే, టిడిపి పోటీలో లేకపోవడంతో వైసిపి వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని మిత్రపక్షాలైన జనసేన, బిజెపి ఆశిస్తున్నాయి. ఆ పార్టీల కింది స్థాయి నాయకత్వం ఆయా గ్రామాల్లోని టిడిపి నేతలను కలిసి మీరు పోటీలో లేనందున తమ పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరింది. అయితే, బిజెపికి, జనసేనకు మద్దతు ఇచ్చేందుకు టిడిపి శ్రేణులు రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో సుముఖంగా లేవు. అక్కకక్కడా కొన్ని చోట్ల మాత్రమే జనసేనకు సహకరించే అవకాశం ఉందని సమాచారం. పైగా, టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా రాష్ట్రంలో పలు చోట్ల టిడిపి అభ్యర్థులు ఎన్నికల బరిలో కొనసాగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో, టిడిపి ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటుందని, ప్రధాన పోటీ అధికార వైసిపికి తమకు మధ్యే ఉంటుందని ఆశించిన బిజెపి, జనసేన శ్రేణులకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అయితే, టిడిపి అస్త్రసన్యానం చేసిన చోట్ల, వామపక్షాలు బరిలో లేని చోట్ల బిజెపి, జనసేనకు కొంచెం ఓట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

గతేడాది మార్చిలో 9,984 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కారణాలతో వీటిలో 288 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 9,696 స్థానాలకుగానూ 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడప జిల్లాలో నాలుగు చోట్ల ఎన్నికలను బహిష్కరించారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థులో పలువురు గతేడాది వ్యవధిలో మృతి చెందారు. మిగిలిన 7,321 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. వీటిలో 977 (13.34 శాతం) ఎంపిటిసి స్థానాల్లో బిజెపి, 1,126 (15.38 శాతం) స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని 660 జెడ్‌పిటిసి స్థానాల్లో ఎనిమిది చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 652 స్థానాల్లో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 526 స్థానాలకూ పోలింగ్‌ జరుగుతోంది. వీటిలో 244 (46 శాతం) జెడ్‌పిటిసి స్థానాల్లో బిజెపి, 166 (31 శాతం) స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. టిడిపి, జనసేన కొన్ని స్థానాల్లో అవగాహనతో ముందుకు సాగాయి. అలాంటిచోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో టిడిపి ఓట్లు జనసేనకు బదిలీ అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో వామపక్ష పార్టీల అభ్యర్థులకు టిడిపి మద్దతు ప్రకటించింది. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల టిడిపి, జనసేన అవగాహనతో ముందుకు వెళ్తున్నాయి. టిడిపి పోటీలో లేకపోతే ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేనకు కొంత కలిసి వస్తుందని అంటున్నారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో నాలుగు ఎంపిటిసి స్థానాల్లో జనసేనకు టిడిపి సహకరిస్తోంది. రావికమతం జెడ్‌పిటిసి స్థానంలో జనసేనకు టిడిపి మద్దతు ఇస్తుండగా, ఈ మండలంలోని ఎంపిటిసి స్థానాల్లో టిడిపికి జనసేన సహకరిస్తున్నట్లు సమాచారం. అన్నింటికీ మించి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రయివేటీకరణ వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. బిజెపితో పొత్తు వల్ల జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డివిజన్‌ బెంచ్‌ తీర్పుతో యథావిధిగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనుంది.