Jan 14,2022 20:21

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసులో వెల్దుర్తి మండల పరిషత్‌ అధ్యక్షుడు సహా ఎనిమిది మందినిపోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను గుంటూరులోనిజిల్లా పోలీస్‌ కార్యాలయంలో రూరల్‌ ఎస్‌పి విశాల్‌గున్ని వెల్లడించారు. దీని ప్రకారం... తోట చంద్రయ్య ద్విచక్ర వాహనంపై బజారుకువెళ్లి వస్తుండగా ఎంపిపి చింతా శివరామయ్య, మరో ఏడుగురు కలిసి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చింతా శివరామయ్య, తోట చంద్రయ్య గ్రామంలోనిఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకే సామాజిక తరగతికి చెందిన వారు. వీరి మధ్య సిమెంట్‌ రోడ్డు విషయంలో గొడవలు జరిగాయి. అప్పటి నుండి వీరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల పదిన గ్రామంలో వీరి బంధువుల కుమార్తె ఓణీల కార్యక్రమానికి హాజరైన బంధువులతో శివరామయ్యను చంపుతానని చంద్రయ్య హెచ్చరించాడు. అది తెలిసిన శివరామయ్య తన కుమారుడు, మరో ఆరుగురుతో కలిసి చంద్రయ్యను హత్య చేశాడు. తాము అరెస్టు చేసిన వారిలో శివరామయ్య, చింత యలమందకోటయ్య, ఎస్‌.రఘురామయ్య, ఎస్‌.రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింతా ఆదినారాయణ ఉన్నారని ఎస్‌పి తెలిపారు. వారినిముసుగులతో మీడియా ముందు ప్రవేశపెట్టారు.