May 28,2023 22:25

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

-చంద్రబాబువి దివాళా రాజకీయాలు
- రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: 
తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వచ్చే సార్వత్రిక ఎన్నికలే చివరి ఎన్నికలు అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని ఉండ్రుకుడియాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని విమర్శించారు. చంద్రబాబు డిక్షనరీలో వెన్నుపోటు, మోసం, దగా తప్ప నీతి, నిజాయితీ మచ్చుకైనా కనిపించవన్నారు. పిల్లను ఇచ్చిన మామ ఎన్‌టిఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ మహా నటుడు ప్రాణాలు తీసి ఇప్పుడు మహానాడులో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలదండ వేయడం చంద్రబాబు దివాళా రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసినా, ఏ రోజైనా పేదల కోసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు సంక్షేమ మేనిఫేస్టోను విడుదల చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు తన మనుషులు, తన సామాజిక తరగతి బాగోగులు చూసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించే విధంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ చేయడమే ధ్యేయమన్నారు. సర్పంచ్‌ ప్రతినిధి కొర్ల వెంకటేష్‌ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో ప్రణాళికా సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు హనుమంతు వెంకటరావుదొర, ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, వైసిపి మండల అధ్యక్షులు పి.గురయ్యనాయుడు, వైస్‌ ఎంపిపి ప్రతినిధి తమ్మినాన శాంతారావు, మల్లా రవికుమార్‌, ఎంపిటిసి యు.కామేశ్వరరావు, సర్పంచ్‌లు కె.మల్లేశ్వరస్వామి, చింత హేమారావు, కొల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.