
కదిరి టౌన్ : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపట్టిన టిడ్కో గృహాలను సైతం పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నుంచి మంగళవారం పాదయాత్ర మొదలైంది. ఉదయం కదిరి ఆర్డీవో కార్యాలయం నుంచి పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి పట్టణ సమీపంలోని టిడ్కో గృహాలను పరిశీలించారు. ఆలీపూర్ తండా, ముత్యాలచెరువు వద్ద స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. మధ్యాహ్నం పుట్టపర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరుకుంది. నల్లమడ మండలం పులగంపల్లి వద్ద లోకేష్‌కు టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మిట్టపల్లి వద్ద దివ్యాంగులతో మాట్లాడారు. అక్కడి నుంచి గొనుకువారిపల్లి క్రాస్ విడిది కేంద్రం వద్దకు పాదయాత్ర కొనసాగింది. కదిరి టిడ్కో గృహాల పరిశీలన అనంతరం లోకేష్ మాట్లాడుతూ టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన ఇళ్లను వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేక పోతోందన్నారు. టిడిపి హయాంలో ఉన్న లబ్ధిదారులను తొలగించి వైసిపి నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తున్నారని తెలిపారు. అప్పట్లో పేదలు కట్టిన డిడి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది అంటే వైసిపి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి టిడ్కో గృహాలను పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ పని చేయకుంట రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
లోకేష్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పాదయాత్ర సందర్భంగా కదిరి పట్టణంలో నారా లోకేష్‌ను కలిశారు. ఎమ్మెల్సీలు చిరంజీవి రావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. కదిరి మండలం ముత్యాల చెరువు వద్ద విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌బాషా, పరిటాల శ్రీరామ్, సవితమ్మతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.
లోకేష్ పాదయాత్రకు తరలివెళ్లిన నాయకులు
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మంగళవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలం పులగంపల్లికి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర అడుగెడుతున్న సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సారథ్యంలో భారీగా తరలి వెళ్లారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల నుంచి ద్విచక్ర వాహనాలలో బయలుదేరి వెళ్లారు. వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలలో ఉత్సాహంగా పార్టీ జెండాలతో వెళ్లారు. సమ్మతి, అసమ్మతి అనే భేదాలు లేకుండా నాయకులందరూ నారా లోకేష్ దష్టిలో పడటానికి పోటాపోటీగా వారి అనుచరులతో వెళ్లారు.