Feb 06,2023 20:40

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-విజయనగరం కోట : జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1 లక్షా 80 వేలను రూ.5 లక్షలకు పెంచాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణం అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద సిపిఐ ఆధ్వర్యాన ధర్నా చేశారు. ధర్నాకు సిపిఎం, టిడిపి, ఆమ్‌ ఆద్మీ, లోక్‌సత్తా, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు కె. దయనంద్‌, లోక్‌ సత్తా జిల్లా నాయకులు రాజారావు, జనసేన పార్టీ జిల్లా నాయకులు త్యాడ రామకృష్ణ మాట్లాడారు. జగనన్న కాలనీల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్తు లైట్లు, మంచినీటి పైపు లైన్లు వేసి కుళాయి కనెక్షన్లు లాంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అశోక్‌, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.