
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : వ్యాధి నిరోధక టీకాలే పశువులకు శ్రీరామరక్ష అని రాజంపేట పశువర్ధక శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ ఆరిఫ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని హస్తవరం రెడ్డివారిపల్లి గ్రామంలో సర్పంచ్ మహీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పశు విజ్ఞాన బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరిఫ్ మాట్లాడుతూ పశువులలో ప్రమాదకర వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం ద్వారా ప్రమాదకర వ్యాధుల నుంచి పశువులను రక్షించవచ్చునని తెలిపారు. శువులలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కె.ప్రతాప్ మాట్లాడుతూ పశువులలో అత్యవసర చికిత్సలకు 1962కు ఫోన్ చేయడం ద్వారా పశు వైద్య సంచార వాహనం ద్వారా సేవలను పొందవచ్చునని తెలియజేశారు. ఈ వాహనం నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంటుందని, ప్రతి పాడి రైతు ఈ వాహన సేవలను వినియోగించుకోవాలని కోరారు. పశువులలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయబడునని తెలియజేశారు. కార్యక్రమంలో చెర్లోపల్లె పశువైద్యాధికారి శరత్ కుమార్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పశువులలో మినరల్ మిక్చర్ మరియు నట్టల నివారణ మందులు యొక్క ఆవశ్యతను గురించి వివరించారు. కార్యక్రమంలో జెబిఒ వరదయ్య, పశువైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.