Jan 13,2022 19:32

అసలే పెద్ద పండగ. ఇంటినిండా జనం. పిల్లలూ పెద్దలూ అంతా కలిసి ఒకటే సందడి. చుట్టాలూ, స్నేహితులూ ఇంటికొచ్చి పకలరిస్తూ ఉంటారు. ఆ పరవశాల వేళ .. ఇంట్లో ఉన్నప్పుడు తినటానికీ, తిరిగి ఊరెళ్లిపోతున్నప్పుడు వెంట తీసుకు వెళ్లటానికీ చిరుతిళ్లు కావాలి కదా! మామూలు రోజుల్లో కొత్త రకాలు ట్రై చేయొచ్చు కానీ, పండగ వేళల్లో సాంప్రదాయ పిండివంటలకే పెద్ద పీట. చాలామంది ఇప్పటికే సిద్ధం చేసి ఉంటారు. చేయనివాళ్లు, ఇంకెందుకు, ఆలస్యం? వంటింటి పదార్థాలతోనే పండగ పిండివంటలు సిద్ధం చేసేయండి, మరి! తీయతీయగా... తాజా తాజాగా రెడీ చేయండి!

పొడి పిండితో అరిసెలు
కావాల్సిన పదార్థాలు:
బెల్లం : ఒక కప్పు
పొడి బియ్యప్పిండి : ఒక కప్పు
గోధుమ పిండి : అరకప్పు
నీళ్లు : ఒకటిన్నర కప్పు
యాలకలు : ఐదు
నువ్వులు : రెండు స్పూన్లు
నెయ్యి : రెండు స్పూన్లు
నూనె : తగినంత
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టి, తరిగి పెట్టుకున్న బెల్లం వేయాలి. అదే కప్పుతో ఒకట్నిర కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఆ గిన్నె పొయ్యిమీద పెట్టి బెల్లం నీళ్లు మరగించాలి. ఇందులో యాలకుల పొడి, నువ్వులు, నెయ్యి వేసి కలదిప్పాలి. మంట తగ్గించుకుని బెల్లం నీళ్లలో పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్దగా అయ్యేంత వరకూ కలిపి దాని మీద మూత పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత ఒక కళాయిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి, వేడి చేయాలి. అరిసెలు ఒత్తుకునేందుకు ఒక నూనె కవర్‌ తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్న పిండిని మరొకసారి చేత్తో ఐదు నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా పిండిని తీసుకుని, ఒక స్పూను నీళ్లలో తడిపి ఉంచిన నువ్వులను అద్దుకోవాలి. చేతికి నూనెగానీ, నెయ్యిగానీ పూసుకుని ఉండను కవర్‌ మీద పెట్టి మరీ మందంగా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో పిండిని ఒత్తుకోవాలి. దాన్ని తీసి వెంటనే కాగిన నూనెలో వేయాలి. అరిసె ఒక వైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ అరిసెను కాలనివ్వాలి. కళాయిలో నుంచి అరిసె తీసి ఒక ప్లేటులో ఉంచి, దాని మీద మరొక ప్లేటు ఉంచి నూనె బయటకు వచ్చేలా గట్టిగా వత్తాలి. అంతే వేడి వేడి నువ్వుల అరిసెలు సిద్ధం!

పప్పు చెక్కలు
కావాల్సిన పదార్థాలు:
బియ్యప్పిండి : అరకేజీ
అల్లం : చిన్న ముక్క
మిర్చి : ఏడు లేదా ఎనిమిది
సగ్గుబియ్యం : ఒక కప్పు
పెసరపప్పు : ఒక కప్పు
జీలకర్ర : ఒక స్పూను
నువ్వులు : రెండు స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : ఒక కప్పు
ఉప్పు : తగినంత
నెయ్యి : రెండు స్పూన్లు
నీళ్లు : ఒక కప్పు
నూనె : డీప్‌ఫ్రైకి తగినంత
తయారీ విధానం :
ఒక పెద్ద గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని, అందులో గంటసేపు నానబెట్టిన సగ్గుబియ్యం, పెసరపప్పు వేయాలి. మొత్తగా గ్రైండ్‌ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, నువ్వులు వేసి కలపాలి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి మళ్లీ పిండి మొత్తం బాగా కలపాలి. తర్వాత బాగా వేడిచేసిన నెయ్యిని పిండిలో పోయాలి. చివరిగా గోరు వెచ్చని నీటిని కొంచెం కొంచెంగా పిండిలో పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీప్రెస్‌తో చెక్కలను గుండ్రంగా వత్తిపెట్టుకోవాలి. ఒక కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. వేడయ్యాక మంటను మీడియంలో ఉంచి నాలుగు, ఐదు చెక్కలను ఒకేసారి వేసి వేయించాలి. లైట్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు ఉంచి చెక్కలను బయటకు తీయాలి.

సకినాలు
కావాల్సిన పదార్థాలు :
బియ్యం : ఒక కిలో
నువ్వులు : ఆరు టీస్పూన్లు
జీలకర్ర : రెండు టీస్పూన్లు
వాము : ఒక టీస్పూను
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
తయారీ విధానం :
నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని వడగట్టి ఒక గంటపాటు నీడలో ఆరనివ్వాలి. తర్వాత బియ్యాన్ని మిక్సీలో వేసి పిండిని జల్లించుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, నవ్వులు, జీలకర్ర, వాము వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండికన్నా వదులుగా కలుపుకోవాలి. ఒక కాటన్‌ బట్ట తీసుకొని దానిపై సకినాలు వేసుకోవాలి. చేతిలోకి పిండి తీసుకొని వేళ్ల సహాయంతో వదులుతూ సన్నగా చుట్టుకోవాలి. అన్నీ చుట్టుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. సమాంతరంగా ఉన్న ప్లేటు లేదా గరిటె సహాయంతో బట్టపై నుండి సకినాలను తీసి నూనెలో వేయాలి. మంటను హైఫ్లేమ్‌లో ఉంచి నూనె పొంగు తగ్గాక రెండోవైపు తిప్పేయాలి. అరనిమిషం తర్వాత నూనెలోనుంచి తీసేస్తే సకినాలు సిద్ధమైనట్టే!

తీయతీయగా...