Feb 06,2023 23:42

ప్రజాశక్తి పత్రికను ఇస్తున్న స్థానికులు

ప్రజాశక్తి -నక్కపల్లి :అస్తవ్యస్తంగా ఉపమాక పుష్కరిణి అనే వార్త సోమవారం ప్రజాశక్తిలో ప్రచురణ మవ్వడంతో వైస్‌ ఎంపీపీ నానాజీ, స్థానిక నాయకులు శీరం నరసింహమూర్తి, కొప్పిశెట్టి హరిబాబు, కొల్లాటి బుజ్జి, సత్తిబాబు తదితరులు ఎమ్మెల్యే గొల్ల బాబురావు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే బాబురావు పత్రికలో వచ్చిన కథనాన్ని చదివారు. పుష్కరిణి చాలా అధ్వానంగా ఉందని, వచ్చే నెలలో స్వామివారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సుధూరు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పుష్క రిణిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారని, చెరువు అపరిశుభ్రంగా ఉండటంతో స్నానాలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. కనీసం కాళ్లు కడుక్కునేందుకు కూడా అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ, టిటిడి డిప్యూటీ ఈవోతో మాట్లాడి చెరువు శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.