Sep 14,2021 10:20

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్‌లు హస్తగతం చేసుకోవడంతో.. కాబూల్‌ విమానాశ్రయం నుండి వేలాది మంది పారిపోతున్న దృశ్యాలను పలు మీడియాలు ప్రధానంగా ప్రచురించాయి.  కాబూల్‌ విమానాశ్రయాన్ని మూసివేయడంతో.. ఇతర దేశాల సరిహద్దుల్లో వేచిచూస్తున్నారు. పాకిస్తాన్‌, ఇరాన్‌, ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌తో ఉన్న ఆఫ్ఘన్‌ సరిహద్దుల్లో వేలాది మంది పడిగాపులు పడుతున్నారు.  గత తాలిబన్‌ల పాలనను తలుచుకుని భయాందోళనలకు గురైన పలువురు ఆఫ్ఘన్‌లు దేశాన్ని విడిచి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. పాకిస్తాన్‌తో ఉన్న ఆఫ్ఘన్‌ సరిహద్దు నుండి గతవారం వేలాది మంది బోర్డర్‌ దాటుతున్న శాటిలైట్‌ దృశ్యాలను ఎన్‌డిటివి ప్రచురించింది. చమన్‌ సరిహద్దు పోస్ట్‌ వద్ద సెప్టెంబర్‌ ఆరున రికార్డు చేయబడిన చిత్రాలను విడుదల చేసింది. ఆఫ్ఘన్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న స్పిన్‌బోల్డక్‌లోని చమన్‌ సరిహద్దులో ఉన్న పరిస్థితులను ఈ చిత్రాలు తెలుపుతున్నాయి. చమన్‌ సరిహద్దు ఇరుదేశాల మధ్య అత్యంత రద్దీగా ఉండే క్రాసింగ్‌లలో ఒకటి. అయితే ఇటీవల పాకిస్తాన్‌ చమన్‌ సరిహద్దు పోస్ట్‌ను మూసివేసింది. దీంతో తమకు అవసరమైన వస్తువులు, పిల్లలతో ఉన్న కుటుంబాలు గత కొన్ని వారాలుగా తాత్కాలిక శిబిరాల వద్ద వేచి చూడటంతో ట్రాఫ్రిక్‌ పెరిగింది.దేశం విడిచివెళ్లేందుకు వేలాది మంది సరిహద్దుల వద్దకు చేరుకున్న దృశ్యాలను స్పష్టంగా చూపుతున్నాయి. స్పిన్‌ బోల్డకే కాకుండా తజికిస్తాన్‌ సరిహద్దు ప్రాంతం షిర్‌ఖాన్‌, ఇరాన్‌ సరిహద్దు ఇస్లాంకాలా, పాకిస్తాన్‌ మరోసరిహద్దు టోర్ఖామ్‌లకు కూడా వేలాది మంది చేరుకుంటున్నారు.

Taliban  : పాక్‌ సరిహద్దుల్లో వేచి వున్న ఆఫ్ఘన్‌ల శాటిలైట్‌ దృశ్యాలు

 

Taliban  : పాక్‌ సరిహద్దుల్లో వేచి వున్న ఆఫ్ఘన్‌ల శాటిలైట్‌ దృశ్యాలు