Jan 13,2021 06:47

భారతదేశ రాజకీయ, ఆర్థిక వైఖరిలో...1990వ దశకం తరువాత చెప్పుకోదగిన మార్పు జరిగింది. ఆ తరువాత దశకాలలో రాజకీయ, ఆర్థిక రంగాలలో నయా ఉదారవాద విధానాల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు మొదలయ్యాయి. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంపాటు చేసిన స్వాతంత్య్ర పోరాట విలువలు, దేశ సార్వభౌమత్వం, లౌకికతత్వం, ఫెడరలిజం ప్రశ్నార్థకంగా మారాయి.
 

దృష్టి మళ్ళించే ప్రయత్నాలు
అనేక రంగాలలో ఆర్థిక బాధలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికవర్గ పోరాటాలు విస్తరిస్తున్నాయి. తమ జీవనోపాధి కోసం, న్యాయం కోసం పోరాడుతున్న కార్మికులను విభజించి, అదుపు చేయాలని పాలక వర్గాలు చూస్తున్నాయి. 'ఆధ్యాత్మిక రాజకీయాలు' లాంటి పదాలను మీడియా ద్వారా వ్యాప్తి లోకి తీసుకొస్తూ, ప్రజల రాజకీయ, ఆర్థిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. నేటి ఈ పరిస్థితులలో, ఉద్యోగ విరమణ చేసిన జడ్జీలు, ఐఎఎస్‌, ఐపిఎస్‌, మిలిటరీ అధికారులు, ఇతర అధికారులు, త్వరలో ఉద్యోగ విరమణ పొందే అధికారులు, సినీ నటులు ఈ రాజకీయ కదన రంగంలోకి దూకుతున్నారు. సాంస్కృతికంగా దిగజారిన స్థితికి, నేటి భయంకర పరిస్థితులకు తాము కూడా బాధ్యులమే అన్న వాస్తవాన్ని వారు మర్చిపోతున్నారు. కానీ వారు రాజకీయాలను శుద్ధి చేసి, ప్రజలను, ఈ వ్యవస్థను కాపాడే రక్షకులుగా నటిస్తున్నారు. మీడియా ఇటువంటి దానికి మరింత ప్రచారం చేస్తుంది.


ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రాజకీయ విభాగంగా ఉన్న బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, స్వాతంత్య్ర పోరాటాన్ని వక్రీకరించడం, ప్రజాస్వామిక విలువలను, ప్రజల ఐక్యతను నాశనం చెయ్యడం, రాజ్యాంగ విలువలను బలహీన పర్చడం, దుర్మార్గంగా రాష్ట్రాల హక్కులను లాక్కోవడం మనం చూస్తున్నాం. కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం నిరంతరాయంగా కొనసాగుతున్నది. సంవత్సరాల పాటు ప్రజలు కష్టపడి పన్నులు చెల్లించి, జాతీయ పొదుపు ద్వారా నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను వారు వ్యూహాత్మకంగా అమ్ముతున్నారు. ఇప్పుడు 'వ్యవసాయ చట్టాలను' (ఎవరూ గమనించడం లేదనే భావనతో) రహస్యంగా, చట్ట విరుద్ధంగా ఎగువ సభలో ఆమోదింపచేసుకొని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్‌, రైల్వేలు, బీమా, సేవా రంగాలను వేగంగా ప్రైవేటీకరిస్తున్నారు.


ద్రవిడ పార్టీలు తమిళనాడు రాష్ట్రాన్ని 1967 నుండి పాలిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో వారి పాలనా తీరు పట్ల చాలా విమర్శలు ఉన్నాయి. కానీ గుజరాత్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే అనేక రంగాలలో తమిళనాడు చాలా ముందున్న వాస్తవాన్ని కాదనలేం. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్ర పాలక పార్టీ అయిన ఎఐఎడిఎంకె, ద్రవిడ పార్టీ నుండి నెమ్మదిగా దూరం అవుతోంది. బిజెపి దయాదాక్షిణ్యాలపై అధికార పీఠంపై కూర్చుని, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తిగా రాజీ పడుతూ, రాష్ట్రం లోకి బిజెపి అడుగు పెట్టే అవకాశం ఇస్తున్నది.
 

దగ్గర మార్గాల రాజకీయ నాయకులు
ఈ నేపథ్యంలో, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ లాంటి సినీ నటులు, తమిళనాడును తలకిందులు చేస్తామంటూ రాజకీయాలలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కమల్‌హాసన్‌ ఇప్పటికే 'మక్కల్‌ నీధి మైయామ్‌ (ఎంఎన్‌ఎం) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. రజనీకాంత్‌ సంకోచిస్తూనే, అనేక ప్రకటనల తరువాత డిసెంబర్‌ 31, 2020లో పార్టీని స్థాపిస్తానని తేదీ ఖరారు చేశాడు. కానీ అనారోగ్యం కారణంగా పార్టీని స్థాపించనని డిసెంబర్‌ 29న ప్రకటించాడు. తరువాత తనది ఆధ్యాత్మిక రాజకీయ విధానమని ప్రకటించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కు వుంటుంది. రజనీకాంత్‌ కూడా అదే పని చేయొచ్చు. కానీ మీడియా ఆయనకు అధిక ప్రాధాన్యతనిచ్చి, 'రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడు' అనేదే పెద్ద వార్త అయినట్లు బాకా ఊదారు. అది ఇప్పుడు నిరుత్సాహ పరిచింది. కమల్‌హాసన్‌ హిందూత్వ రాజకీయాలను విభేదిస్తున్నప్పటికీ, ఆయన రాజకీయ ప్రచారం అస్పష్టంగా ఉంది.


అభిమానులు ఒకరిని 'ప్రపంచ హీరో'గా, మరొకరిని 'సూపర్‌ స్టార్‌'గా పిలుస్తారు. వీరు అవినీతి వ్యతిరేక ప్రచారకులుగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు, ఆధ్యాత్మికం రెండూ భిన్నమైన పరిధులలో ఉండే అంశాలు. రజనీకాంత్‌ ముందుకు తీసుకొస్తున్న ఆధ్యాత్మిక రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్‌ ను తన విధానం గురించి అడిగితే, 'అన్నా-యిజం' తన విధానమని సమాధానమిచ్చాడు. అదేమిటని ప్రశ్నిస్తే, క్యాపిటలిజం, సోషలిజం, ఫాసిజంల కలయికే అన్నా-యిజం అని పేర్కొన్నాడు. కానీ రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయాలు మరింత గందరగోళంగా ఉన్నాయి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత ప్రశాంతత, శ్రేయస్సు కోసం చేసే ఒక కాలక్షేప కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలున్నవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మానవుల పుట్టుకకు ముందు, మరణం తరువాత ఏం జరుగుతుందనే విషయాలకు సంబంధించిన నమ్మకాలు వారికి వుంటాయి. అలాంటి భావజాలం అన్ని మతాలలో, విశ్వాసాలలో ఉంటుంది. వారు ఈ ప్రపంచాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో వివరిస్తారు. ఆధ్యాత్మికతకు, మతానికి మధ్య కొన్ని సారూప్యతలు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికత, రాజకీయాలు రెండు భిన్నమైన పద్ధతులను కలిగి ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికతకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం ఉండదు.


చాలా మంది మత విశ్వాసకులు సంఘసంస్కర్తలుగా కూడా ఉన్నారు. వివేకానందుడు, రామలింగ ఆదిగలార్‌, వైకుండసామి, నారాయణగురు, కున్రాక్కుడి ఆదిగలార్‌ మొదలగు అనేక మంది మత విశ్వాసకులుగా ఉంటూనే, సంఘ సంస్కరణల కోసం గొంతెత్తారు. వారు మతాల వ్యవస్థీకరణను తీవ్రంగా విమర్శించారు. అహేతుకమైన విశ్వాసాలను వ్యతిరేకించారు. కుల వివక్షతను ఖండించడంతో పాటు మహిళా హక్కుల కోసం పోరాడారు. రజనీకాంత్‌ సూచించిన ఆధ్యాత్మిక రాజకీయాలు భిన్నమైనవి. సమాజ శ్రేయస్సుకు విరుద్ధమైనవి. ఆధ్యాత్మిక రాజకీయాలకు, బిజెపి రాజకీయాలకు సారూప్యత ఉంది. బిజెపి అభివృద్ధి నిరోధక రాజకీయాలకు రజనీకాంత్‌ సూచించిన రాజకీయాలు ప్రత్యేక ఆకర్షణనిస్తాయి.
 

ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
కొన్ని అమెరికా యూనివర్శిటీలలో, ఇతర చోట్ల ఆధ్యాత్మికత బోధిస్తున్నారు. ఆధ్యాత్మికతకు, మతానికి సంబంధం లేదని అక్కడ చెపుతున్నారు. అది యోగాసనాలు, ప్రాణాయామం లాంటి ఒక కళ మాత్రమే. అద్వైతను బోధించిన ఆదిశంకరుడు, ఈ ప్రపంచం అంతా ఒక భ్రమ అని పేర్కొన్నాడు. మన కళ్ళు చూసినది ఏదైనా భ్రమే అన్నాడు. ''మనం చూసిన దానినే గట్టిగా విశ్వసిస్తాం. చూడని దానిని విశ్వసించం. మనం చూసేదంతా శక్తి. ఈ వాస్తవం శాశ్వతమైన''దని ప్రముఖ కవి, భారతీయార్‌ ఆస్తికుడైనప్పటికీ, భ్రమ సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు.


ప్రజల మత విశ్వాసాల నేపథ్యాన్ని మార్క్సిజం అర్ధం చేసుకుంటుంది. కానీ, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను మార్చడం ద్వారా మాత్రమే మొత్తం ప్రపంచ ప్రజల శ్రేయస్సును సాధించవచ్చన్న స్పష్టత మార్క్సిజం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక రాజకీయాలను ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజలను గందరగోళపరిచే ఏ ప్రయత్నమైనా, లౌకికతత్వాన్ని బలహీనపరచి, రాజకీయాలలో, ప్రభుత్వ పాలనలో మతతత్వ ఎజెండాను బలపరుస్తుంది. ఈ చర్య ద్వారా, కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చే సేవలు చేస్తున్న వాస్తవాన్ని సామాన్య ప్రజల కళ్ళు కప్పి రహస్యంగా ఉంచే ప్రయత్నం హిందూత్వ శక్తులు చేస్తాయి. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవినీతి, పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా ఉత్పన్నమయ్యే పరిణామాలలో ఒకటి. కమ్యూనిస్టులు ఈ అవినీతికి, దానిని సృష్టించే పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాడుతారు. అవినీతిని సులభతరం చేసి, దానిని ప్రోత్సహించే అంశాలను నిర్మూలించకుండా అవినీతిని నిర్మూలించలేము.
 

అవినీతి మూలం
లోక్‌పాల్‌ బిల్లు కోసం అన్నా హజారే నాయకత్వం వహించిన ఉద్యమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తో పాటు అనేక సంస్థలు దాని వెనుక నిలిచాయి. దానికి మీడియా విస్తృత ప్రచారాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు బిజెపి పాలనలో అవినీతి బాగా పెరిగింది. లోక్‌పాల్‌ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, బిల్లులో లంచం తీసుకున్న వారిని శిక్షించాలనే నిబంధన ఉంది కానీ లంచం ఇచ్చిన వారికి ఏ శిక్ష లేదని, నాటి రాజ్యసభ ఛైర్మన్‌ దృష్టిని ఆకర్షించారు. అవినీతి కేవలం కింది స్థాయిలోనే జరగడం లేదని చెప్తూ, ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు బిల్లులో ఏ నిబంధనలు లేవని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీల యజమానులు మిలిటరీ పరికరాల కొనుగోలులో, ప్రభుత్వ కాంట్రాక్టులలో భారీగా లంచాలిచ్చారు. లంచాలు ఇచ్చిన వారూ తీసుకున్న వారు సామాన్య ప్రజలు కాదు. భారీ లంచాలను అందించి కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీల వారు పనులు చేయించుకుంటున్నారు. అందువలన, లంచాలను ఇచ్చే వారిని కూడా శిక్షించే విధంగా బిల్లులో సవరణ చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారుగానీ ప్రభుత్వం దాన్ని అంగీకరించ లేదు.


ఇప్పుడు బిజెపి పాలనలో అవినీతికి 'చట్టబద్ధత' ఏర్పడింది. రాజకీయ పార్టీలు 'ఎలక్టొరల్‌ బాండ్ల' పేరుతో భారత దేశం లోని ప్రముఖులు, బహుళజాతి కంపెనీల నుంచి ఎంత డబ్బైనా తీసుకోవచ్చు. దాని కోసం స్పష్టంగా చట్టపరమైన సౌకర్యాలు కల్పించారు. ఛారిటబుల్‌ ట్రస్ట్‌లు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2019లో ఒక సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా, 'పవిత్రమైన దేవుని ట్రస్ట్‌' పేరుతో కార్పొరేట్‌ కంపెనీలు ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టవచ్చు.


ఒక్కసారిగా తెర పైకి వచ్చిన అవినీతి వ్యతిరేక కార్యకర్తలు ఈ విషయాల గురించి మాట్లాడరు. 'తమిళనాడును మారుస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం' అని మాట్లాడే రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ లాంటి వారు ఈ తరహా అవినీతి గురించి మాట్లాడరు. రాజకీయాలంటే పోరాటాల యుద్ధ భూమి. రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పుల గురించి మాట్లాడకుంటే...ఆధ్యాత్మిక రాజకీయాలు, అభివృద్ధి నిరోధక విధానాలను (మతానికి, రాజకీయాలకు ముడిపెట్టడం ద్వారా) రహస్యంగా తీసుకొని వచ్చే వారికి సహాయం చేస్తాయి.


రాజకీయాలు, మతం విడివిడిగా ఉండాలి. ఈ రెండింటికీ సంబంధం లేదు. వాటిని కలిపి చూసే వారి లక్ష్యంలో నిజాయితీ ఉండదు. మానవజాతి విముక్తి, సోషలిస్ట్‌ వ్యవస్థ స్థాపన కోసం జరిగే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రస్తుత ప్రపంచంలో 'భూతల స్వర్గం' లాంటి సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం మానవ జాతికి మార్గం చూపేది మార్క్సిజమే. ఆ వ్యవస్థే అన్ని సమస్యలకు పరిష్కారం.
                                                         * టి.కె.రంగరాజన్‌ (రాజ్యసభ మాజీ ఎం.పి)