Jul 19,2021 19:21

మనుషులతో సహా ప్రతి జీవీ వైరస్‌ను నిరోధించేందుకు తన శరీరంలో శక్తి కలిగి ఉంటుంది. దీన్ని ఇమ్యూనిటీ, లేదా రోగనిరోధక శక్తి అంటాం. ఈ రోగ నిరోధక శక్తి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సహజరోగనిరోధక శక్తి. రెరడవది అనుసరణ పూర్వక (అడాప్టివ్‌) రోగనిరోధక శక్తి. సహజరోగనిరోధక శక్తి అనేది ఫలానా వైరస్‌ అని లేకుండా అన్ని రకాల వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

         చైనాలో కోవిడ్‌ - 19 వ్యాధి మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి రూపంలో బయటపడింది. 2019 డిసెంబర్‌లో చైనా పారిశ్రామిక నగరమైన వూహాన్‌లో చాలామంది ఈ వ్యాధితో ఆసుపత్రులకు రావడం ప్రారంభించారు. కొత్త రకం అంటువ్యాధి ప్రబలింది అని కొందరు నిపుణులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే చైనా ప్రభుత్వం తొలుత దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ డిసెంబర్‌ ఆఖరు, జనవరి ప్రారంభానికల్లా కేసుల సంఖ్య పెరిగిపోవడం, వ్యాప్తి తీవ్రం కావడంతో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, నిపుణులు వెంటనే రంగంలోకి దిగారు. చైనా ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో దేశాధ్యక్షుడు మాట్లాడుతూ.. 'మనం ఒక కంటికి కనిపించని క్రిమితో యుద్ధంలో ఉన్నాం. పార్టీ కార్యకర్తలు, సైన్యం, ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్‌లైన్‌లో ఉండి పోరాడాలి' అని పిలుపునిచ్చారు.
    వాస్తవానికి ఈ హెచ్చరిక చేసినప్పటికీ- అప్పటికి ఈ కొత్తరకం కరోనా వైరస్‌ గురించి శాస్త్రవేత్తలకు కూడా తెలిసింది చాలా తక్కువ. ఇది ఊపిరితిత్తులకు సోకుతుందనీ, నోరు, ముక్కు నుంచి వచ్చే సూక్ష్మాతి సూక్ష్మమైన తుంపర్ల ద్వారా మనిషి నుంచి మనిషికి చేరుతుందని తెలుసుకున్నారు. అందువల్ల నోటినీ, ముక్కునూ కప్పుతూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. రెండు మాసాల్లోనే వూహాన్‌ నగరంలో 70 వేల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు పెద్దయెత్తున అవసరమయ్యాయి. ఈ సదుపాయాలతో అదనంగా ఆసుపత్రి పడకలు సృష్టించాల్సి వచ్చింది. వీటి కోసం చైనా ప్రభుత్వమూ, ప్రజలూ ఏకతాటిపై నిలిచి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకున్నారు. వూహాన్‌ నగరంలో వెయ్యి, 1200 పడకలు గల పెద్ద ఆసుపత్రులను పది రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. వాటిలో సగం పడకలకు వెంటిలేటర్లు అమర్చారు. సైనిక వైద్యులంతా చికిత్సలోకి దిగారు. కొద్ది రోజుల్లోనే ఇతర పరిశ్రమలను మాస్కులు, శానిటైజర్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేసే పరిశ్రమలుగా మార్పు చేశారు. వూహాన్‌ నగరాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు. నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా వారికి కావల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను ప్రభుత్వమే ఇళ్ల వద్దకు సరఫరా చేసింది. టెక్నాలజీలో శరవేగంగా ముందుకు పోతున్న చైనా తన సాంకేతిక పరిజ్ఞానాన్నంతటినీ, ముఖ్యంగా కృత్రిమ మేథ, బిగ్‌ డేటా, ఇంటర్‌నెట్‌ను ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో కొత్త కరోనా వ్యాధి సోకిన వారితో మెలిగిన వారినీ, వారిని కలుసుకున్న వారినీ (ఫస్ట్‌ కాంటాక్ట్‌, సెకెండ్‌ కాంటాక్ట్‌) గుర్తించి క్వారంటైన్‌లో పెట్టింది. ఈ విధంగా మొత్తం ప్రభుత్వం, సైన్యం రంగంలోకి దిగి రెండు మాసాల్లో వ్యాధిని అదుపులోకి తేగలిగింది. మార్చి చివరికి చైనా 80 వేల కరోనా కేసులు, నాలుగున్నర వేల మరణాల వద్ద కరోనాను పూర్తిగా అదుపులోకి తేగలిగింది. మూడు నెలల పాటు స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగలిగింది.
       కరోనా నుంచి రక్షించుకుంటూనే చైనా శాస్త్రవేత్తలు ఈ కొత్త రకం వైరస్‌ జన్యు నిర్మాణాన్ని విశ్లేషించి దాన్ని ఇంటర్‌నెట్‌లో ప్రపంచానికంతటికీ అందుబాటులో పెట్టారు. ఈ సమాచారంతో ప్రపంచవ్యాపితంగా అనేక దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన అనేక పశ్చిమ దేశాలూ, భారత్‌, చైనా వంటి వర్ధమాన దేశాల్లో శాస్త్రవేత్తలు నెలరోజుల్లోనే 200కు పైగా వ్యాక్సిన్లు తయారు చేసి క్లినికల్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. అన్ని దేశాలూ కరోనాతో పోరాడే విధానం, వ్యాక్సిన్ల తయారు, పంపిణీలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలనూ, ప్రభుత్వాలనూ హెచ్చరించడం ప్రారంభించింది.
ఫిబ్రవరి 2020లో హెచ్‌డబ్యువో హెచ్చరించింది!
      చైనాలో ఒక ప్రాంతానికి పరిమితమైనంతవరకు కోవిడ్‌-19 స్థానిక అంటువ్యాధిగానే (ఎండెమిక్‌) ఉంది. అందువల్ల అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఈ వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోయాయి. కానీ ఇది ప్రపంచవ్యాపితంగా సోకే మహమ్మారి (పెండెమిక్‌)గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరిలోనే హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని కూడా చాలా దేశాలు పట్టించుకోలేదు. అయితే ప్రపంచీకరణ యుగంలో అన్ని దేశాల మధ్య రాకపోకలు విపరీతంగా పెరిగిన దశలో వ్యాధి ప్రపంచవ్యాపితం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అందునా వూహాన్‌ నగరం పారిశ్రామిక, విద్యా కేంద్రం గనుక ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు నిత్యం అక్కడికి వచ్చి పోతుంటారు. దాంతో జనవరి చివరి నాటికే అనేక పశ్చిమ దేశాలకూ, మార్చి నాటికి దాదాపు ప్రపంచ దేశాలన్నిటికీ మహమ్మారి వ్యాపించింది.
వ్యాధి నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
      మనుషులతో సహా ప్రతి జీవీ వైరస్‌ను నిరోధించేందుకు తన శరీరంలో శక్తి కలిగి ఉంటుంది. దీన్ని ఇమ్యూనిటీ, లేదా రోగనిరోధక శక్తి అంటాం. ఈ రోగ నిరోధక శక్తి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సహజరోగనిరోధక శక్తి. రెరడవది అనుసరణ పూర్వక (అడాప్టివ్‌) రోగనిరోధక శక్తి. సహజరోగనిరోధక శక్తి అనేది ఫలానా వైరస్‌ అని లేకుండా అన్ని రకాల వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఉదాహరణకు మన చర్మంపై ఏర్పడిన మృతకణాల పొర అనేక రకాల వైరస్‌లను శరీరం లోపలికి పోకుండా అడ్డుకుంటుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు అందులోని వైరస్‌లను మన జీర్ణాశయంలోని ఆమ్లాలు చంపేస్తాయి. ఈ అడ్డంకులను కూడా దాటుకుని వైరస్‌లు మన శరీర కణాల్లోకి ప్రవేశిస్తే మన శరీరం ఉత్పత్తి చేసే 'ఇంటర్‌ఫెరాన్లు' అనే ప్రత్యేక హార్మోన్లు వైరస్‌ సోకిన కణాలనూ, దాని చుట్టుపక్కల కణాలనూ చంపేయడం ద్వారా వైరస్‌లు ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుపడతాయి. శరీర కణం లోపల కూడా వైరస్‌లను నాశనం చేసే ఎంజైములు ఉంటాయి. వీటిని ఆర్‌ఎన్‌ఎ ఇంటర్‌ఫెరెన్స్‌ అంటారు. మన రక్త కణాల్లోని కొన్ని కణాలు వైరస్‌ సోకిన కణాలను మింగేస్తాయి. ఇన్ని రకాల రక్షణ వ్యవస్థలను దాటుకుని వైరస్‌ మన శరీరంలో పెరిగినప్పుడు మాత్రమే దానివల్ల మనకు రోగం వస్తుంది.
    ఇక మన శరీరంలో అనుసరణ పూర్వక రోగనిరోధక శక్తి (ఎడాప్టివ్‌ ఇమ్యూనిటీ) రక్తంలోని తెల్ల కణాల జ్ఞాపక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. ఒక రకమైన వైరస్‌లు మన శరీరంలోకి పదే పదే ప్రవేశించినప్పుడు తెల్ల రక్తకణాలు వాటిని గుర్తుపెట్టుకుని అనేక రకాల ప్రత్యేక అణువులను తయారు చేస్తాయి. ఈ తెల్ల రక్త కణాలను 'లింపోసైట్స్‌' అంటారు. అవి ఉత్పత్తి చేసే ప్రత్యేక అణువులను 'యాంటీబాడీలు' అంటారు. మన శరీరంలో తయారైన ఈ యాంటీబాడీలు ఆ వైరస్‌లు మరోసారి దాడి చేసినప్పుడు గుర్తుపెట్టుకుని వాటికి అతుక్కుని శరీర కణాల్లోకి వైరస్‌లు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఒక రకమైన యాంటీబాడీలు నిర్ధిష్టమైన వైరస్‌లను మాత్రమే నిరోధించగలవు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకసారి మన శరీరంలోకి ప్రవేశించిన ఒకానొక రకం వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలను మన శరీరం తయారు చేసుకుని ఉంటుంది. ఈసారి ఆ రకం వైరస్‌లు ప్రవేశిస్తే ఆ నిర్ధిష్ట యాంటీబాడీలు వాటి పని పడతాయి. అయితే ఒక కొత్త రకం వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరం దానితో పోరాడడానికి అనేక రకాల యాంటీబాడీలు తయారు చేస్తుంది. రోగం తగ్గిపోయిన తరువాత ఈ యాంటీబాడీల్లో కొన్ని మాత్రమే తిరిగి ఉత్పత్తి అవుతూ జీవితాంతం ఆ వైరస్‌ను నిరోధించే శక్తిని శరీరానికి ఇస్తాయి. అందుకే వైరస్‌ వ్యాధి వచ్చి నయం అయిన వారిలో చాలాకాలం వరకు, కొందరిలో జీవితాంతం రోగనిరోధక శక్తి ఉంటుంది. కోవిడ్‌-19 వచ్చి నయం అయిన వారిలో కూడా చాలామందికి ఈ రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. కోవిడ్‌-19 వ్యాధి వచ్చిన వారిలో చాలామందికి రోగ లక్షణాలు కనిపించకుండానే తగ్గిపోతుంది. అటువంటి వారికి కోవిడ్‌-19 యాంటీబాడీ టెస్టులు చేసి వారికి వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోగలుగుతున్నారు.
                                         (రేపటి సంచికలో ... వ్యాక్సిన్లతోనే సంపూర్ణ రక్షణ)