
తిరువనంతపురం : విమానం ఎక్కాలని చాలామంది ఆశపడతారు. సరిగ్గా అటువంటి ఆకాంక్ష ఉన్న ఓ తొమ్మిదేళ్ల బాలుడి కలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నెరవేర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా రాహుల్‌గాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేరళ రాష్ట్రంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కన్నూర్ జిల్లాలోని ఇంట్లో అద్వైత్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో రాహుల్‌కు ఎదురుగా కూర్చొన్న అద్వైత్తో కూడా మాట్లాడుతూ.. తన కలలు, ఆకాంక్షలు గురించి అడిగి తెలుసుకున్నారు. తాను పైలట్ అవ్వాలని ఆశపడుతున్నాను అని అద్వైత్ రాహుల్‌కి బదులిచ్చాడు. కాగా, ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజు తన కలను నెరవేర్చేందుకు రాహుల్ ఓ చిన్న ప్రయత్నం చేశారు. ఒక విమానం లోపలికి అద్వైత్ను తీసుకొచ్చి.. విమానం ఎలా ఎగురుతుంది? దాన్ని పైలట్ ఎలా నడుపుతారు అనేది తనకు వివరంగా చెప్పారు. ఆ విమానంలో రాహుల్‌తోపాటు, పైలట్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనికి 'ఏ కల చాలా పెద్దది కాదు. అద్వైత్ కలను నిజం చేయడానికి మేము మొదటి అడుగు వేశాము. ఇప్పుడు ఒక సమాజాన్ని, నిర్మాణాన్ని సృష్టించడం మన కర్తవ్యం. అది అతనికి ప్రతి అవకాశాన్ని ఇస్తుంది' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సుమారు ఒకటిన్నర లక్షల మందికిపైగానే వీక్షించారు. చాలా మంది నెటిజన్లు రాహుల్‌గాంధీ చేసిన పనికి సూపర్ సార్ అంటూ అభినందిస్తున్నారు.