Oct 12,2021 19:05

డజను గుడ్లు పగలకుండా ఇంటికి తీసుకెళ్లడానికే తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా స్టేజీపై నడిచి అందరినీ ఆశ్చరపరిచాడు. తన ట్యాలెంట్‌తో గిన్నీస్‌ రికార్డుకెక్కాడు. అతనెవరని తెలుసుకోవాలని ఉందా..? వివరాల్లోకి వెళితే.. పశ్చిమాఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా. వందల గుడ్లను టోపీపై పెట్టుకుని అవి కిందపడకుండా నడవడం అతని ప్రత్యేకత. తన ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో తిరిగి ప్రదర్శించి ఎగ్‌మ్యాన్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో 735 గుడ్లను అతికించుకున్న టోపీ తలపై పెట్టుకుని కిందపడిపోకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు. దీన్ని చూసిన గిన్నీస్‌ రికార్డు అధికారులు 'వావ్‌' అనకుండా ఉండలేకపోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ గుడ్లను తను ధరించే టోపీపై అతికించడానికి మూడురోజులు సమయం పట్టిందట.
గ్రెగరీ దా సిల్వా ఛానెల్‌లో ప్రదర్శించిన వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. 'ఇమ్‌ప్రెస్సివ్‌గా ఉంది అని ఒక నెటిజన్‌.. మరొకరేమో.. అసలు గుడ్లన్నీ కలిపి ఎంత బరువుంటుంది అని సరదాగా కామెంట్‌ చేశారు.

వీడియో https://www.instagram.com/reel/CU5yfsOIQ1i/?utm_source=ig_web_copy_link