Oct 12,2021 17:45

బెంగళూరు : బెంగళూరులో సోమవారం కుండపోత వర్షం కురిసింది. వర్షం కారణంగా.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాని(కెఐఎఎల్‌)కి చేరుకోవల్సిన ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులనెదుర్కొన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో కొంతమంది ప్రయాణీకులేమో రోడ్డు పక్కన లగేజీతో నిలబడి ఉన్నారు. మరికొంతమందేమో విమానాశ్రయానికి అటువైపుగా వెళుతున్న ట్రాక్టర్‌లో లగేజీతోపాటు ఎక్కి ఎలాగోలా.. విమానాశ్రయానికి చేరుకున్నారు. ట్రాక్టర్‌ ఎక్కి విమానాశ్రయానికి చేరుకోవడం వైరల్‌గా మారింది. ఈ వీడియో రోడ్లపై వరదనీరు ఎలా ప్రవహిస్తుందో చూపిస్తుంది. ఈ సంఘటనపై బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సిఇఓ జయరాజ్‌ షణ్ముగమ్‌ స్పందిస్తూ.. ''2008 నుండి నేను ఎయిర్‌పోర్టులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులను మేము ఇదివరకెప్పుడూ చూడలేదు. భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల వరదనీటితో నిండిపోయింది.' అని ఆయన అన్నారు.
సోమవారం కురిసిన భారీ వర్షాల వల్ల బెంగళూరు నగరంలో కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వరదనీరు ఇళ్లలోకి చేరి ప్రజలు చాలా ఇబ్బందులనెదుర్కొన్నారు. రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు.