Jul 18,2021 11:08

తరగతిగదిలో బోధనా స్వేచ్ఛను కాపాడుకోవడం మన విశ్వవిద్యాలయాల ప్రధాన బాధ్యత. బోధన, అభ్యాసం వృద్ధి చెందాలంటే ప్రొఫెసర్లకు సంస్థాగత సెన్సార్‌షిప్‌, బెదిరింపుల నుండి విముక్తి కావాలి. నేర్చుకోవడం, చర్చించడం వంటి అభ్యాసాలను సులభతరం చేయడానికి తగినట్లుగా తరగతిని నడపడానికి అనుమతించాలి. అప్పుడే విద్య యొక్క విలువ పెరుగుతుంది. తద్వార పరిశోధనాత్మక విద్యవైపు విద్యార్థులు అడుగులేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతికూల పరిణామాలకు భయపడకుండా తరగతిగదిలో, సమాజంలో జరిగే పరిణామాలను.. వాస్తవాలను బోధించే అధ్యాపకులపై దాడులు, సస్పెన్షన్లు ప్రస్తుతం సాధారణమయ్యాయి. తరగతిగదిలో అధ్యాపకుల బోధనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ.. కొన్ని మూకలు వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కొందరు అధ్యాపకుల సస్పెన్షన్‌ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కేరళ సెంట్రల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిల్బర్ట్‌ సెబాస్టియన్‌ సస్పెన్షన్‌ ఈ రకమైన దాడులకు అద్దం పడుతుంది. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

01

    కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు. ఈ కాలంలో దేశంలోని పలు క్యాంపస్‌లలో ఉపాధ్యాయులు, విద్యార్థులపై అనేక దాడులు జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, దాని విద్యార్థి విభాగం చేసిన దాడుల్లో నష్టపోయిన ఉపాధ్యాయుడు ఒక్క సెబాస్టియన్‌ మాత్రమే కాదు. ఇదేమీ మొదటి ఘటన అంతకన్నా కాదు. వివిధ కోర్సుల్లో సిలబస్‌ జాబితా నుండి అధ్యాయాలు, పుస్తకాలు సైతం తొలగింపుకు గురయ్యాయి. వారి భావజాలానికి ఎదురెళ్లిన ఎందరో ఉపాధ్యాయులపై విచారణ కమిటీలు వేసి, సస్పెండ్‌ చేశారు. అంతేకాదు అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఎబివిపి కార్యకర్తల నుండి శారీరక దాడులను ఎదుర్కొన్నారు.
 

                                                           కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీ ఘటన..

   మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాటు ప్రారంభించడానికి విద్యార్థులను ప్రేరేపించారనీ.. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి వ్యతిరేకంగా 'ప్రోటో-ఫాసిస్ట్‌ సంస్థలు' అని పేర్కొన్నారన్న ఆరోపణలతో.. కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గిల్బర్ట్‌ సెబాస్టియన్‌ను సస్పెండ్‌ చేశారు. అనంతరం తిరిగి నియామకం చేసింది. అయితే నివేదికల ప్రకారం, కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీలోని ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిల్బర్ట్‌ సెబాస్టియన్‌ తన ఉపన్యాసంలో హిందువులు, స్వస్తిక, హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర హిందూ సంస్థలపై ద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
     ఈ సంఘటన తరువాత ఎబివిపి, దాని అనుబంధ విద్యార్థి సంస్థలు సెబాస్టియన్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా అతనిని తొలగించాలని డిమాండ్‌ చేశాయి. ఆయనపై వీసీ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల విభాగం అఖిల్‌ భారతీయ విద్యా పరిషత్‌ (ఎబివిపి) బెదిరించింది. తన ఆన్‌లైన్‌ తరగతికి సంబంధించి మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు, మైనారిటీ విద్య) సభ్యుడు ఎ వినోద్‌ కరువరాకుండు కూడా కేంద్ర విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు.
     అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన వైస్‌-ఛాన్సలర్‌ ఈ ఆరోపణలపై స్పందించారు. కెపి సురేష్‌, విద్యావేత్తల డీన్‌, ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ జాన్‌, పరీక్షల కంట్రోలర్‌ మురళీధరన్‌ నంబియార్లను అంతర్గత కమిటీ సభ్యులుగా నియమించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. కమిటీ తన నివేదికను సమర్పించింది. సెబాస్టియన్‌ కూడా తన వివరణను సమర్పించారు. అయితే, అధికారులు దీనిని సంతృప్తికరంగా లేదని గుర్తించి అతనిని సస్పెండ్‌ చేశారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.

                                                                  వాక్‌స్వాతంత్య్రానికి ఎదురుదెబ్బ..

02

   భారత్‌లో వాక్‌స్వాతంత్య్రానికి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంటూ అశోకా యూనివర్శిటీ ప్రొఫెసర్లు ప్రతాప్‌ భాను మెహతా, అరవింద్‌ సుబ్రహ్మణ్యం గతంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయపరమైన కామెంట్స్‌ రాసినందుకే ప్రతాప్‌ భాను మెహతాను యాజమాన్యం లక్ష్యంగా చేసుకుని బయటకు వెళ్లేలా చేసింది. ప్రస్తుత ప్రభుత్వం విధానాలపై తన కాలమ్స్‌తో ప్రశ్నిస్తున్నందుకే ప్రతాప్‌ భాను మెహతాను గతంలో టార్గెట్‌ చేశారు. అయితే ట్రస్టీలు ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాల్సింది పోయి, రాజీనామా చేయాల్సిందిగా బలవంతం పెట్టడం బాధాకరం. అయితే అప్పట్లో న్యూయార్క్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ, ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్లు వీరికి మద్దతుగా నిలిచారు.

aravind subrahmanyam
                                                 aravind subrahmanyam


     మనది ప్రజాస్వామ్య సమాజం. మన క్యాంపస్‌లు సైద్ధాంతికంగా చాలా వైవిధ్యమైనవి. భిన్నంగా ఆలోచించే ఉపాధ్యాయులతో సంభాషించే అవకాశం విద్యార్థులకు ఉంది. ఇది సమాచారం, జ్ఞానం యొక్క విభిన్న వనరులకు పరిచయం చేస్తుండడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాంప్రదాయవాదులు, రైటిస్టులు, ఉదారవాదులు, వామపక్షవాదులు క్యాంపస్‌లలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థుల క్రియాశీలత యొక్క శక్తివంతమైన చరిత్రను కలిగి ఉన్నాయి. విభిన్న సైద్ధాంతిక విద్యార్థి సంస్థలు ఎప్పుడూ క్యాంపస్‌లలోనే ఉన్నాయి.

bhanu mehata
                                                              bhanu mehata


     అయితే విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం ఒక నిర్దిష్టమైన 'జాతీయతను' ప్రోత్సహించాల్సి ఉంది. ఒక భావజాలం లేదా ఆ భావజాలం మోసేవారిపై విమర్శలు చాలా ప్రమాదకరంగా మారాయి. గిల్బర్ట్‌ సెబాస్టియన్‌ చేసినదంతా తన తరగతిగదిలో 'ఫాసిజం, నాజీయిజం' గురించి చర్చించడం. ది న్యూస్‌ మినిట్‌ ప్రకారం, ''ఆన్‌లైన్‌ క్లాస్‌లో, భారతదేశంలోని సంఫ్‌ు పరివార్‌ను ప్రోటో-ఫాసిస్ట్‌ సంస్థగా పరిగణించవచ్చు'' అని గిల్బర్ట్‌ వివరించారు. అతను జనరల్‌ ఫ్రాంకో ఆధ్వర్యంలో స్పెయిన్‌, ఆంటోనియో డి ఒలివెరా సాలజర్‌ ఆధ్వర్యంలో అర్జెంటీనా, జువాన్‌ పెరోన్‌ ఆధ్వర్యంలో అర్జెంటీనా, అగస్టో పినోచే ఆధ్వర్యంలో చిలీ, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష పాలన, రువాండాలో హుటు ప్రభుత్వం ప్రోటో-ఫాసిస్టులకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.

                                                               దశాబ్దాలుగా చర్చనీయాంశమైన అంశం..!

03

    ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రోటో-ఫాసిస్ట్‌ సంస్థగా వర్ణించడం సరైనదా కాదా అనే దానిపై చర్చించే విషయం పక్కనబెడితే... మనదేశంలో ఇది దశాబ్దాలుగా చర్చనీయాంశమైన విషయం. వామపక్షవాదులకూ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫాసిస్ట్‌, ప్రోటో-ఫాసిస్ట్‌, ఫాసిస్టిక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ను వివరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మందికి, ఫాసిస్ట్‌ అనే పదం దుర్వినియోగంతో సమానం. గుజరాత్‌లో 2002లో జరిగిన హింసాకాండ తరువాత రాసిన ఒక వ్యాసంలో.. ఆశిస్‌ నంది ఈ పదాన్ని ఉపయోగించడాన్ని వివరించాడు. '''ఫాసిస్ట్‌'' అనే పదాన్ని దుర్వినియోగ పదంగా ఉపయోగించను. ఇది ఒకరి సైద్ధాంతిక కోణం మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ లక్షణాలు, భావజాలానికి సందర్భోచితంగా ప్రేరేపించే నమూనాలను కలిగి ఉన్న ఒక విశ్లేషణ'' అని ఆశిస్‌ వివరించారు.

                                                                          బహుళత్వంపై దాడి..

04

    నయా ఉదారవాద విధానాల అమలుతో పాటు మితవాద రాజకీయాల ఆలోచనా సరళి ప్రస్తుతం విద్యావ్యవస్థను ప్రభావితం చేస్తోంది. విద్యావిధానంలోకి హిందూత్వ సిద్ధాంతాల్ని చొప్పించే ప్రయత్నం జరుగుతోంది. పాలకపార్టీ విద్యావ్యవస్థను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. సంస్కృతి రక్షణ పేరుతో ''సాంస్కృతిక జాతీయవాదం'' అన్న తన లక్ష్యం వైపు విద్యావ్యవస్థను నడిపించే దుస్సాహసం చేస్తోంది. భారతీయ భాషలు అత్యంత గొప్ప భాషలనీ, అలాగే శాస్త్రీయమైన సుందరమైన భాషలనీ ఎన్‌ఈపీ పేర్కొంది. అయితే విద్యా విధానపత్రంలో మాత్రం కొన్ని భాషలకే ప్రాధాన్యత కలిపించింది. త్రిభాషా సూత్రంలో హిందీ, సంస్కృత భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఊర్దూ కూడా భారతీయ భాషనే కానీ ఉర్దూ భాషకు క్లాసికల్‌, ప్రాంతీయ భాషల లిస్ట్‌లో చోటు దక్కలేదు. విదేశీ భాషల జాబితాలో రష్యన్‌, స్పానిష్‌, జర్మన్‌, జపనీస్‌ ఉన్నాయి. కానీ మండారిన్‌ (చైనా)కి చోటు లేదు. మనదేశ చరిత్రలోని కొన్ని అధ్యాయాలను తీసివేసే ఉద్దేశంతో పాఠ్యాంశాలను మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రాచీన భారతదేశ జ్ఞానం ఆధునిక భారత దేశానికి ఎలా ఉపయోగపడిందో చెప్పడం బాగానే ఉంది. కానీ మధ్య యుగాలనాటి చరిత్రను, అది భారతీయ విజ్ఞానాన్ని సుసంపన్నం చేసిన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం.. విధానకర్తల పక్షపాత ధోరణికి నిదర్శనంగా ఉంది. ప్రాచీన భారతదేశ వారసత్వ జ్ఞానం కింద బుద్ధుడు, మహావీరుడు, చార్వాకుడు, లోకాయత సిద్ధాంతాల గురించి కానీ, ద్రవిడ సాహిత్యం గురించి కానీ, సూఫీ వారసత్వం గురించి కానీ ప్రస్తావన లేదు. రిజర్వేషన్‌ గురించి, అణగారిన వర్గాలకు విద్య అందుబాటులో లేకపోవడంలో పితృస్వామ్యం, కుల ఆధిపత్య ధోరణుల పాత్ర గురించి చెప్పలేదు. కుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పూలే దంపతులు, సాహు మహారాజ్‌, పెరియార్‌, నారాయణగురు, అంబేద్కర్‌ లాంటి వారి గురించి కూడా ప్రస్తావన లేదు.

                                                                           రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం

05

    కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీలో రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ గిల్బర్ట్‌ సెబాస్టియన్‌ను ఇటీవల సస్పెండ్‌ చేసి, తిరిగి నియామకం చేశారు. సస్పెండ్‌ చేయడానికి చెప్పిన కారణం క్లాస్‌ రూంలో సెబాస్టియన్‌ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు, సిద్ధాంతాలు విమర్శించాడని అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) ఫిర్యాదు చేయడమే. ఈ సస్పెన్షన్‌ ప్రొఫెసర్‌ యొక్క తరగతిగది అటానమీపై దాడి చేయడమే. తరగతిగదిలో, యూనివర్శిటీలలో ప్రొఫెసర్లు భిన్నమైన అభిప్రాయాలను, దృక్కోణాలను వివరిస్తారు. డిబేట్‌ చేస్తారు. ఢిల్లీలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మొదలైన వాటిలో గొప్ప గొప్ప ప్రొఫెసర్లు భిన్నమైన అభిప్రాయాలను ఏవిధంగా వ్యక్తం చేశారో దేశం మొత్తానికీ తెలుసు. అన్ని రంగాల్లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తాము చెప్పే దానికంటే, భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిపై దాడులు చేయడం జరుగుతుంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం.
                                                                                                                              - కె.ఎస్‌.లక్ష్మణరావు

                             
                                                                       అధికారాల కేంద్రీకరణ..

06

    ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ అన్ని నిర్ణయాల కేంద్రీకరణను ఎన్‌ఈపీ ప్రతిపాదిస్తుంది. దీనికిగానూ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌, నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, జనరల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీలాంటి సంస్థలను ఏర్పరిచే ప్రతిపాదనలను చేసింది. దీనివల్ల విద్య అనే అంశంలో రాష్ట్రాల హక్కు దెబ్బతీసేలా ఉంది. ఈ మార్పుల వల్ల దేశ సమాఖ్య స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉంది.
 

                                                             సిలబస్‌పైనా కాషాయ దాడులు..

    ప్రముఖ రచయిత్రి అరుంధతిరారు 2010లో చత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీ కార్యకర్తలతో కలిసి వాళ్ళతో కొంతకాలం గడిపి, వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి 'వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌' పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని తమిళనాడు తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్‌ యూనివర్సిటీ 2017లో ఎంఏ ఇంగ్లీష్‌ సిలబస్‌లో చేర్చింది. ఆ పుస్తకం సిలబస్‌లో ఉండడంపై అప్పటి నుండే మంటగా ఉన్న కాషాయదళం సిలబస్‌ నుండి తీయించడానికి చాలా ప్రయత్నమే చేసింది. అయితే ఇప్పుడు రాజ్యం ఉన్న స్థితిలో.. కింది నుండి పై దాకా ప్రతి ఒక్క వ్యవస్థ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్న పరిస్థితి దాపురించింది. ఈ కాలంలో మనోన్మణియం సుందరనార్‌ యూనివర్సిటీ పాలక వర్గంపై ఒత్తిడి తెచ్చి, ఎబివిపి ఆ పుస్తకాన్ని సిలబస్‌ నుండి విజయవంతంగా తొలిగించగల్గింది.
        ''ఈ పుస్తకాన్ని ఇంతకాలం సిలబస్‌గా ఉంచడం దురదష్టకరం. ఈ పుస్తకాన్ని ఎంఏ ఇంగ్లీష్‌లో చేర్చడం అంటే మావోయిస్టుల భావజాలాన్ని విద్యార్థుల మీద రుద్దడమే. ఈ పుస్తకాన్ని సిలబస్‌గా కొనసాగించడం రాజ్యాంగవిరుద్ధం..'' అంటూ ఎబివిపి నాయకులు కార్యకర్తలు వైస్‌ ఛాన్సలర్‌ కేకే పిచుమణిని కలిసి, నిరసన తెలిపారు. ఒకవేళ పుస్తకాన్ని సిలబస్‌ నుండి తీసివేయకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం దష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఈ పుస్తకాన్ని సిలబస్‌ నుంచి తీసేస్తున్నట్టు వీసీ ప్రకటించారు. ఈ పుస్తకం స్థానంలో ఎం కష్ణన్‌ రాసిన 'మై నేటివ్‌ ల్యాండ్‌ ఎస్సేస్‌ ఆన్‌ నేచర్‌' అనే పుస్తకాన్ని చేర్చారు.

 

07


 

                                                                   పరీక్షలే అంతిమమా ?

    పిల్లల్ని అంచనా వేయడానికి ఇప్పటివరకూ కేవలం పరీక్షలపైనే ఆధారపడుతున్నాం. పరీక్షలు కూడా పిల్లల్ని అంచనా వేయడానికి బదులుగా వారిని దోషులుగా చూపడానికి, న్యూనతకు గురయ్యేలా చేయడానికి, ఒత్తిడి, ఆందోళనను పెంచడానికి తోడ్పడుతున్నాయి. ఒకరకంగా పరీక్షలే విద్యావ్యవస్థను శాసిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం, పరీక్షలు పిల్లల్ని కేవలం అంచనా వేయడానికి పరిమితం కాకుండా, పిల్లలు నేర్చుకోడానికి దోహదపడేలా ఉండాలి. పిల్లలను అంచనా వేయడానికి కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ప్రాజెక్టు పనులు, అసైన్‌మెంట్లు, ఫోర్టుపోలియోలు, సెమినార్లు, ప్రదర్శనలు, పరిశీలనలు వంటివాటినీ వినియోగించాల్సి ఉంటుంది. పరీక్షల్లోని ప్రశ్నల స్వభావాన్ని మార్చడం, బట్టీని ప్రేరేపించే ప్రశ్నలు, పాఠ్యపుస్తక సమాచారానికే పరిమితమయ్యే ప్రశ్నల స్థానంలో పిల్లలు సొంతంగా ఆలోచించి రాయడానికి తోడ్పడాలి. తమ అనుభవాలను వ్యక్తపరచడానికి, బహు విధాలైన సమాధానాలు రాయడానికి, నిత్యజీవితంతో అన్వయించడానికి వీలుగా ఆలోచింపజేసే ప్రశ్నలు ఉండాలి. ఆ విధంగానే బోధనా జరగాలి.

 

07

                                                                 

                                                                          పరిమితం కాకూడదు..

08

    ''జాతి భవిష్యత్తు తరగతిగదిలో నిర్మాణమవుతుంది!'' అని కొఠారి కమిషన్‌ పేర్కొంది. అంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పిలల్ని జాతికి ఉపయోగపడే హేతుబద్ధమైన పౌరులుగా తయారుచేసే గురుతరమైన బాధ్యతను పోషించాల్సింది ఉపాధ్యాయులే. విద్యార్థులు ఆలోచించగలగడం, వ్యక్తీకరించగలగడం, విచక్షణతో వ్యవహరించగలగడం, సబ్జెక్టులవారీగా, తరగతి వారీగా నిర్ధారించిన సామర్థ్యాలను సాధించగలగడం వంటివి నాణ్యమైన విద్యలో ముఖ్యమైన అంశాలు. వీటిని పొందేలా చేయడం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల బాధ్యత. వీటిని సాధించేలా చేయాల్సింది ఉపాధ్యాయులు. విద్య వ్యాపారాత్మకమైన నేటి పరిస్థితుల్లో పాఠశాలలు తమ బాధ్యతను నిర్వర్తించడం, ఇందుకనుగుణంగా ఉపాధ్యాయులు తమ విధులను నెరవేర్చడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారాన్నే జ్ఞానంగా భావించడం.. ఆ సమాచారాన్నే పిల్లలకు అందించడం లేదా అర్థం చేయించడమే బోధనకు పరమావధి. వీటిని జ్ఞాపకం పెట్టుకోవడాన్ని పరీక్షించడమే పరీక్షల ముఖ్యోద్దేశం. విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకోవాలని, జ్ఞాన నిర్మాతలని గుర్తించాలి. తాము పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో వినియోగించగలిగేలా చేయాలి. వారిని పాఠ్యపుస్తకాలకూ, తరగతిగదికే పరిమితం కానీయకూడదు. పరిశోధనలు, ప్రయోగాలు, ప్రాజెక్టుపనులు, ఆవిష్కరణలు, ప్రతిచర్యలతో కూడిన బోధనాభ్యసన ప్రక్రియలుండాలి. ఇందుకనుగుణంగా విమర్శనాత్మక, సామాజిక నిర్మాణాత్మక వాదానికి చెందిన బోధనా పద్ధతులు ఉండాలి. పిల్లల సామర్థ్యాలను, ఆలోచనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అంచనావేసేలా బోధనా పద్ధతులు ఉండాలి.

                                                                        అధ్యాపకుల హక్కు..

09

 

10

    

ప్రొఫెసర్లు తరగతి పాఠాల కంటెంట్‌, తరగతిగది చర్చను నిర్ణయించే హక్కును కలిగి ఉంటారు. ఉత్సుకత, ఆరోగ్యకరమైన సంశయవాదం నేర్చుకోవడం యొక్క ముఖ్యభాగాలు. అలాగే ప్రొఫెసర్లను తరగతిగది వాతావరణానికి నాయకులుగా గౌరవించడమూ కీలకమే. తరగతిగదులు విద్యార్థుల భవిష్యత్తుకు కాలిబాటలు (గ్రీన్‌స్పేస్‌లు). ప్రొఫెసర్‌ చేతిలో ఉన్న అంశం ఆధారంగా అనుకూలతలు, ప్రతికూలతలను చర్చించాలి. సమాజంలో సనాతనవాదులను ప్రశ్నించాలంటే ఇలాంటి వివాదాస్పద అంశాలపై అవగాహన ఉండాలి. గెలీలియో మతవిశ్వాసంపై అభియోగాలు మోపబడకపోతే.. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్నందుకు బోధన నుండి నిషేధించబడితే.. ఏ ఆవిష్కరణలు చేయగలిగేవాడు? అనే విషయాన్ని గుర్తించాలి. అందుకే తరగతిగదిలో అధ్యాపకుల బోధనా స్వేచ్ఛను కాపాడాలి.

- ఎవిఎస్‌ఎన్‌