Sep 28,2020 17:03

త్రీడీలో తిరిగేయొచ్చు!

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. కళ్ల ముందే ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఆశ్చర్యచకితుల్ని చేసే వింత అనుభవాల్ని మనుషులకు అందిస్తోంది ఈ సాంకేతిక పరిజ్ఞానం. మన దేశంలోనే మొట్టమొదటిసారి ఆలీపోర్‌ జంతు ప్రదర్శనశాల, బెంగాల్‌ సఫారీ పార్క్‌లో హ్యాలోగ్రాఫిక్‌ యానిమేషన్‌తో ఏర్పాటుచేసిన వర్చ్యువల్‌ రియాలిటీ యానిమల్‌ పార్క్‌ గురించి మనం వినే ఉంటాము. అలాగే ఇంగ్లాండ్‌లోని వూబర్న్‌ సఫారీ పార్క్‌... ఇలా 4డి టెక్నాలజీతో మనుషులు దూరం నుంచే చూపే జంతువులు మన ఒడిలో ఉన్నట్లు చేసే పనితనం ఇక్కడ కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటిదే కానీ మరింత అభివృద్ధి చేసిన టెక్నాలజీతో వాషింగ్టన్‌ యూనివర్సిటీ బృందం సరికొత్త ఆవిష్కరణ ఒకటి తీసుకొచ్చింది.

సాధారణంగా అణుపరమాణు స్థాయి వస్తువులను చూడాలన్నా.. ఇతర గ్రహాలను పరిశీలించాలన్నా.. వాటి చిత్రాలను చూడాలి. లేదంటే వివిధ పరికరాలతో దూరంగా ఉన్న వాటిని అస్పష్టంగా వీక్షించాలి. అయితే ఒక తరగతి గదిలో వాటిని కళ్ల ముందుకు తీసుకొచ్చి చూపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి! పిల్లలకు చెప్పే కథల్లో మాదిరి మనుషులు పరమాణువుల్లా మారిపోయి మానవ శరీరంలోకి ప్రవేశించడం, హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్లు రాకెట్‌ బూస్టర్లతో సులువుగా సౌరవ్యవస్థలోకి ప్రయాణం చేయడం, అంతెందుకు 'డోరేమాన్‌' కార్టూన్‌ ప్రోగ్రామ్‌లో పిల్లలు చేసే పనుల్లాంటివన్న మాట! అలా మనం పరమాణువుల్లా మారిపోయి, అన్నిచోట్లకూ ప్రయాణం చేయలేము కదా! ముఖ్యంగా భూగర్భశాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులు పఠించే విద్యార్థులకు ప్రతి సూక్ష్మమైన విషయంపై అవగాహన అవసరమవుతుంది. మరి అలాంటివారికి భూగ్రహంలో ఏర్పడే రాతి క్రమాన్ని అభివృద్ధి చెందిన ఈ అగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) ద్వారా చూపించగలిగితే ఎలా ఉంటుంది?! ఈ విశ్వవిద్యాలయ బృందం ఇదే పని చేశారు. అగ్మెంటెడ్‌ రియాలిటీ సహాయంతో సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన మార్టిన్‌ ప్రాట్‌ బృందం సరికొత్త యాప్‌లు రూపొందించారు.మరింత సహజంగా ఏఆర్‌!
మరింత సహజంగా ఏఆర్‌!
ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల కోసం 'జియో ఎక్స్‌ప్లోరర్‌' పేరుతో విడుదలైన ఈ యాప్‌లు విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. వీటి ద్వారా వివిధ ఖనిజాల కోసం స్పటికాకార నిర్మాణ రూపాల్లో అధికంగా ఉండే అణువుల క్రమాన్ని చూడటం వీలవుతుంది. అలాగే భూగర్భశాస్త్రంలో ఎన్నో వైవిధ్యమైన రాతి రూపాలు, మొత్తం రాతి గుట్టలు త్రీడిలో చూడటానికి వీలుకలుగుతుంది. ఈ బృందం అభివృద్ధి చేస్తున్న యాప్‌లు స్మార్ట్‌ఫోన్‌లకే కాకుండా మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'హోలోలెన్స్‌' వంటి ఏఆర్‌ డివైజ్‌ల్లోనూ వీక్షించవచ్చు. ఈ డేటాని తెరపైనో, పుస్తకంలోనో ఉన్నట్లు ప్రొజెక్టివ్‌గా చూడటానికి కాకుండా మూడువైపుల నుంచి అగ్మెంటెడ్‌ రియాలిటీలో ఆస్వాదించవచ్చు. అంటే మనం నిజజీవితంలో చేసినట్లే సదరు వస్తువుని లేదా ఆబ్జెక్ట్‌ని చుట్టూ తిరిగి చూడొచ్చన మాట! 'నిజానికి వర్చ్యువల్‌ రియాలిటీతో పోల్చి చూసినపుడు అగ్మెంటెడ్‌ రియాలిటీ మరింత సహజంగా టీచర్‌కీ, విద్యార్థికి మధ్య మంచి అనుసంధానాన్ని అందించగలదని' ఈ ప్రాజెక్టు లీడ్‌ అయిన మార్టిన్‌ ప్రాట్‌ అంటారు. దీనిద్వారా మనం ఏ ప్రదేశానికి వెళ్లాలో శారీరక హావభావాల ద్వారా కంటి సంజ్ఞలతో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయవచ్చు.మరింత సహజంగా ఏఆర్‌!
కళ్ల ముందే మార్స్‌ గ్రహం!
నిజానికి ఏఆర్‌ మనం వాడే డివైజ్‌ల వరకే పరిమితమయ్యింది. దీన్నిబట్టి భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని తరగతిగదిలోకి తీసుకురావచ్చన మాట! నాసాకు చెందిన మార్స్‌ రోవర్‌ బృందం సాంకేతికతను వినియోగించుకుని, త్రీడి విజువలైజేషన్‌ పైన ఇప్పటికే పని మొదలుపెట్టింది. ఇక మార్టిన్‌ ప్రాట్‌ బృందమైతే మార్స్‌ గ్రహాన్ని ప్రాథమిక స్థాయిలో చూడగలిగేంత ముందడుగు వేసింది. ఈ ఏఆర్‌ టెక్నాలజీని రుచి చూసిన విద్యార్థులైతే ఎంతో సంబరపడిపోతున్నారు. ఇకపై ల్యాప్‌టాపులతో కుస్తీ పడనవసరం లేకుండా త్రీ డైమెన్షన్లో డేటాను పరిశీలించవచ్చని అనుకుంటున్నారు. దీని పనితనాన్ని గుర్తించిన ఇతర సబ్జెక్టుల నిపుణులూ వచ్చి, మార్టిన్‌ ప్రాట్‌ను బతిమాలుకుంటున్నారు. ప్రొటీన్‌ మోడళ్లు, ఆర్కియలాజికల్‌ మోడళ్లు, చిత్రకళ వంటి వాటినీ ఇందులో పొందపరచమని అడుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని వాడటంలో మార్టిన్‌ మొదటివారు కాదు. అంతకుముందు ఫొటోగ్రామెట్రీలో ఏఆర్‌ టెక్నాలజీని వినియోగించారు. అయితే భూగర్భశాస్త్రం వంటి ప్రాదేశిక శాస్త్రంలో దీని ఉపయోగం మరింత ఉంటుందని అంటున్నారు నిపుణులు. అవును, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోగలిగితే విద్యార్థులకు మరింత ఉపయోగం చేకూరుతుంది. అందుకే ఇటువంటి సాంకేతికత మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.