Nov 25,2021 09:14

అగర్తలా : త్రిపురలో పుర ఎన్నికల ఓటింగ్‌ ఉదయం ఏడు గంటలకు మొదలైంది. ఆరు నగర పంచాయితీలు, ఏడు మున్సిపల్‌ కౌన్సిళ్లకు, అగర్తల కార్పొరేషన్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి.. మొత్తంగా 644 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా, తమ అభ్యర్థులను బిజెపి కార్యకర్తలు.. మోటార్‌ సైకిళ్లపై తిరుగుతూ బెదిరిస్తున్నారంటూ ప్రతిపక్ష సిపిఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొన్నాయి. ఓటర్లందరినీ పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనివ్వడం లేదని ఆరోపించాయి. మాస్కులు ధరించి, హెల్మెట్‌లు పెట్టుకుని.. ఇంటింటీకి తిరుగుతూ..ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపాయి. ' అగర్తలా మున్సిపల్‌ కౌన్సిల్‌లోని పలు వార్డుల్లో .. బిజెపి ఆదేశానుసారం పెద్ద సంఖ్యలో అక్రమార్కులు ఆయా ప్రాంతాల్లోకి చొరబడి ప్రతిపక్ష మద్దతుదారులను బెదిరిస్తున్నారు. నవంబర్‌ 25న జరిగే ఓటింగ్‌కు వెళ్లద్దని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు' అని సిపిఎం ప్రకటనలో తెలిపింది. గతంలో పుర పోరులో సిపిఎం సత్తా చాటింది. ఇప్పుడు అన్యాయమైన పద్ధతిలో బిజెపి లాక్కోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.