
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చానల్‌పై యూట్యూబ్ వేటు వేసింది. ట్రంప్ ఛానల్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వారం అనంతరం ఈ ఛానల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇటీవల ట్రంప్ ఛానల్లోని ఒక వీడియో హింసను ప్రేరేపిస్తున్నట్లుగా ఉందని యూట్యూబ్ దానిని తొలగించింది. ఆ వీడియోపై వివరణనివ్వాల్సిందిగా ట్రంప్ ఛానల్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. '' ట్రంప్ ఖాతాలో హింసను ప్రేరేపిస్తున్నట్లుగా ఒక వీడియో ఉండటాన్ని మేం గమనించాం. దీంతో స్ట్రైకింగ్ నిబంధనలను అనుసరించి వారం రోజుల పాటు ఆ ఛానల్లో ఏ విధమైన వీడియోలు అప్లోడ్ చేయడం గానీ, లైవ్ ఇవ్వడం గానీ కుదరదు. ఈ నిబంధనలు వారం తర్వాత పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయి'' అని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ ఛానల్లో వ్యాఖ్యలను కూడా డిజేబుల్ చేసినట్లు యూట్యూబ్ సంస్థ వెల్లడించింది. కంపెనీ నిబంధనల ప్రకారం రెండోసారి స్ట్రైక్ వస్తే ఛానల్‌పై రెండువారాల సస్పెన్షన్, మూడు సార్లు స్ట్రైక్ వస్తే ఛానల్‌ను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించింది. కాగా, ఫేస్బుక్, ట్విటర్లు కూడా ట్రంప్ ఖాతాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ గౌరవ డిగ్రీల రద్దు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో అవమానానికి గురయ్యారు. పెన్సిల్వేనియాలోని బెత్లెహెమ్‌లో ఉన్న లేహై యూనివర్సిటీ గతంలో ఆయనకు ప్రదానం చేసిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన మరుసటి రోజే వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌కు చెందిన వాగెర్ కాలేజ్ బోర్డు సైతం 2004లో ట్రంప్‌నకు ఇచ్చిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది.