
ప్రజాశక్తి ఎటపాక
రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తునికాకు టెండర్లను వెంటనే ప్రారంభించాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాక అర్జున్ దొర డిమాండ్ చేశారు. గిరిజన సంఘం కార్యాలయంలో బుద్దుల భద్రయ్య అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో అర్జున్ దొర మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు బీడీ ఆకు సేకరణను పూర్తిగా మర్చిపోయారని, ఆదివాసీల ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలకు తునికాకు సేకరణ ద్వారా రావాల్సిన ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్కకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుండి 2022 వరకు తునికాకు సేకరణ బోనస్ చెల్లించకుండా సేకరణదారుల శ్రమని ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. పెండింగ్లో ఉన్న బోనస్‌లను జాప్యం చేయకుండా వెంటనే సేకరణదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లో కట్టకు రూ.4 నుండి రూ.5 ఇస్తుంటే, ఎపి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. బోనస్ పేరుతో పచ్చికట్టకు సరైన ధర చెల్లించడం లేదని, బోనస్ కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చింతూరు డివిజన్లో నాణ్యమైన తునికాకు లభ్యమవుతుందని, కావున బోనస్ లేకుండా ఒకేసారి పచ్చి కట్టకు రూ.5 చొప్పున చెల్లించాలని, తక్షణమే టెండర్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు సవలం రాము, నక్కా సూరిబాబు, పొడియం దశరధ్, లక్ష్మీనారాయణ, రమాదేవి, కమల, రాములమ్మ, రత్తమ్మ, చిట్టెమ్మ, అంజి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.