Feb 24,2021 01:10

ప్రజలకు సరఫరా చేస్తున్న నాచుతో నిండిపోయిన నీరు ఇదే..

ప్రజాశక్తి- కాకినాడ రూరల్‌ : కాకినాడ రూరల్‌ మండలం తూరంగిని మరో ఏలూరు చేయొద్దని సిపిఎం నాయకులు సిహెచ్‌.అజరుకుమార్‌ అన్నారు. తూరంగిలోని అనిశెట్టి బులెబ్బాయినగర్‌లో ఉన్న మంచినీటి చెరువును కలుషితమవుతం చేయవద్దని, ప్రజలకు మంచినీటి సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకుల బృందం ఈ ప్లాంట్‌ను మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా అజరుకుమార్‌ మాట్లాడారు. ఈ పథకం ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందన్నారు. తాగునీటి చెరువును పాలకులే కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మరో ఏలూరు ప్రమాదాన్ని తలదన్నే పరిస్థితి తూరంగిలో చోటుచేసుకోబోతోందని హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులు యుద్ధ్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయలతో గత ప్రభుత్వ హాయాంలో రక్షిత మంచినీటి చెరువును తూరంగిలో నిర్మించారని తెలిపారు. దీని ద్వారా తూరంగి, పగడాలపేట, ఉప్పలంక, గురజనాపల్లి, నడకుదురు, పాతర్లగడ్డ తదితర గ్రామల ప్రజలకు తాగు నీరు సరఫరా అవుతుందని తెలిపారు. దీని నిర్వహణ సరిగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో 3.4 మీటర్ల వరకూ నీటినిల్వలు ఉండాల్సి ఉండగా, 1.4 మీటర్లు మాత్రమే ఉందన్నారు. చెరువు మొత్తం నాచుతో నిండిపోయిందన్నారు. పెనుగుదురు నుంచి సరిపడా నీరు సరఫరా కావట్లేదన్నారు. దీనిని సరిచేయాల్సిన అధికారులు మురికి నీటిని మోటార్‌ ద్వారా చెరువులో నింపడం దారుణమన్నారు. భవిష్యత్‌లో ప్రజలకు ఏ అనారోగ్య కారణాలు సంభవించినా దానికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తటవర్తి సుబ్బారావు, రాజు, కె.రామారావు, సత్యవతి, జి.రత్నం, శివ, సత్యనారాయణ, శ్రీను, శివాజీ పాల్గొన్నారు.