Jul 29,2021 21:06

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాల ఉపసంహరణపై మోడీ సర్కార్‌ చాలా ఉత్సుకతతో ఉంది. అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)లో వాటాలను విక్రయించక ముందే మరో మూడు పిఎస్‌యుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయాలని బిజెపి ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలుస్తోంది. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, మిశ్ర దాతు నిగమ్‌ లిమిటెడ్‌, రాష్ట్రీయా కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) పద్దతిలో వాటాలను విక్రయించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒక్కరు తెలిపారు. వచ్చే అక్టోబర్‌తో ప్రారంభమయ్యే త్రైమాసికంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ చేపట్టే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్‌ఐసిలో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ ఉండొచ్చన్నారు. అంతకుముందే ఈ మూడు పిఎస్‌యుల్లో వాటాల విక్రయం ఉంటుందన్నారు. ఎల్‌ఐసి డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఇటీవలే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సిపిఇఎ) ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్‌ఐసిలో రూ.1-1.5 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను మార్కెట్‌ శక్తులకు విక్రయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎయిరిండియా, బిపిసిఎల్‌ సంస్థలను పూర్తిగా ప్రయివేటుపరం చేసే పనిలో బిజెపి ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.
నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో 20 శాతం వాటాను విక్రయించే యోచనలో కేంద్రం ఉంది. దీంతో ఇందులో కేంద్ర వాటా 74 శాతానికి పడిపోనుంది. రాష్ట్రీయా కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌, మిధానీలో 10 శాతం చొప్పున వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా ఈ పిఎస్‌యుల్లో సర్కార్‌ వాటా వరుసగా 75 శాతం, 74 శాతానికి తగ్గనుంది. ఈ వారం ప్రారంభంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హుడ్కో)లో ఒఎఫ్‌ఎస్‌ ద్వారా 8 శాతం వాటాను విక్రయించింది. దీంతో కేంద్రానికి రూ.7,646 కోట్ల నిధులు సమకూరాయి. ఎన్‌ఎండిసి ఒఎఫ్‌ఎస్‌ ద్వారా మరో రూ.3,651 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌లోని ఎస్‌యుయుటిఐ వాటా విక్రయం ద్వారా రూ.3,994 కోట్లు చొప్పున కేంద్రం తన ఖజానాలో వేసుకుంది. కాగా.. ఈ మొత్తం విలువ చేసే వాటాలు మార్కెట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో పలు పిఎస్‌యుల్లోని వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు రాబట్టుకోవాలని మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.738 కోట్ల ఎఐ ఆస్తుల అమ్మకం
ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా (ఎఐ)కి చెందిన పలు ఆస్తులను విక్రయించినట్లు కేంద్రం వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటి వరకు రూ.738 కోట్ల విలువ చేసే 115 ఆస్తులను అమ్మినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వికె సింగ్‌ గురువారం పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. దేశంలోని మరో 106 ఆస్తులతో పాటుగా విదేశాల్లోని ఐదు ఆస్తులను అమ్మకానికి పెడుతున్నామని వెల్లడించారు.