Feb 28,2021 21:25

టునిస్‌ : ట్యునీషియాలో అధ్యక్షుడు, ప్రధాని మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసేలా దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఇస్లామిస్ట్‌ ఎన్నాధ పార్టీ రాజధాని టునిస్‌ నగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎన్నాధ పార్టీకి చెందిన మద్దతుదారులు వేలాదిగా పాల్గన్నారు. సెంట్రల్‌ టునిస్‌ వైపుగా ర్యాలీ తీస్తూ.. 'సంస్థల పరిరక్షణను ప్రజలు కోరుకుంటారు.. దేశ ఐక్యత ప్రజలకు కావాలి' అన్న నినాదాలు చేశారు. ట్యునిషియాలో 2011లో జరిగిన విప్లవం తర్వాత ఇంత భారీగా ప్రదర్శన కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. పార్లమెంట్‌ స్పీకర్‌ రాచెడ్‌ గనోచి నేతృత్వంలోని ఎన్నాథ పార్టీ ప్రధాని హిచేమ్‌కు మద్దతుగా ఉంది. కేబినెట్‌ పున:వ్యవస్థీకరణ అంశంపై అధ్యక్షుడు కియాస్‌ సయ్యద్‌కు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళన, దేశంలో ప్రజాస్వామ్యం, విదేశీ రుణదాతల నుంచి పోటీగా వస్తున్న సంస్కరణల డిమాండ్లు, తదితర అంశాలపై వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది.