Mar 18,2023 22:09
  • చర్చకు అనుమతివ్వని స్పీకర్‌
  • టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
  • మండలిలో వాకౌట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన స్వప్రయోజనమా...? రాష్ట్ర ప్రయోజనమా..? శాసనసభలో చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకరు తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో టిడిపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబడుతూ నిరసనకు దిగారు. శనివారం సభ ప్రారంభం కాగానే సిఎం ఢిల్లీ పర్యటనపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం పట్ల నినాదాలు చేస్తూ పేపర్లను చింపి స్పీకర్‌పైకి వేశారు. టిడిపి సభ్యుల తీరుపట్ల స్పీకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా జరగకుండా చేయడం సరికాదని సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకరు కోరారు. టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానించగా.. పది మంది టిడిపి ఎమ్మెల్యేలను సభనుండి స్పీకరు సస్పెండ్‌ చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గద్డె రామ్మోహన్‌రావు, వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్‌, డోలా బాలవీరాంజనేయులు, ఆదిరెడ్డి భవాని, గొట్టిపాటి రవికుమార్‌, గణబాబు, మంతెన రామరాజును సస్పెండ్‌ చేశారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దల వద్దకు సిఎం జగన్‌ వెళ్లారని టిడిపి సభ్యులు అనడంతో చంద్రబాబు నాయుడులా చీకట్లో చిదంబరంను కలవలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే సిఎం ఢిల్లీకి వెళ్లారని వైసిపి ఎమ్మెల్యేలు అన్నారు. ఇందుకు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జోక్యం చేసుకుని చంద్రబాబు 30 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లారని, ఈ అంశంపై కూడా చర్చిద్దామని సవాల్‌ చేశారు. మార్షల్స్‌ వచ్చి టిడిపి ఎమ్మెల్యేలను బయటకు పంపారు. శాసనసభ ప్రారంభంకు ముందు కూడా టిడిపి ఎమ్మెల్యేలు ప్లకార్డులతో ప్రదర్శనగా సభకు వచ్చారు.

  • టిడిపి ఎమ్మెల్సీల వాకౌట్‌

సిఎం ఢిల్లీ పర్యటనపై శాసనమండలిలో చర్చించాలని టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఛైర్మన్‌ మోషేన్‌రాజు దీన్ని తిరస్కరించంతో టిడిపి సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.