Jun 21,2022 13:16

ప్రజాశక్తి - సీతానగరం : సీతానగరం మండలం కాటవరంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. దానిలో కాటవరం ఇసుక ర్యాంపులో అధిక బాటచార్జీలు వసూలు చేస్తున్నారని నిరసన కార్యక్రమం చేస్తున్నారు. జేపీ కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని అడ్డు పెట్టుకొని అనుమతిలేని ప్రైవేటు పట్టాభూముల్లో వేల టన్నులు ఇసుకతవ్వకాలు జరిపి, దొంగ వేబిల్లులుతో కాటవరంలో ఎపిఎండిసి సంస్థ కాటాపై తూకం వేయకుండా, ప్రైవేటు కాంట్రాక్టరు (రమేష్) కాటా పై ఓవర్ లోడ్ వేసుకుని తక్కువ బిల్లు చూపుతున్నారు. అక్రమ ఇసుక తోలకాలు జరుపు తున్నారు. ఈ కాటా వద్ద అనాధికారకంగా ఇసుక స్టాక్ పెట్టుచున్నారని పెందుర్తి వెంకటేష్ వ్యాఖ్యలు చేశారు. దీని పై తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక వ్యాపార నిర్వాహకులు ప్రభుత్వం నుండి ఇచ్చిన అనుమతులు సృష్టమైన ఆధారాలతో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు చూపించకపోతే ఎన్ని రోజులైనా నిరసన ఉద్యమం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.