Mar 18,2023 23:24
  • రాంగోపాల్‌రెడ్డి, చిరంజీవిరావు,కంచర్ల శ్రీకాంత్‌ గెలుపు

ప్రజాశక్తి-యంత్రాంగం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి ఎదురుగాలి వీచింది. మూడు స్థానాలూ టిడిపికే దక్కాయి. ఆద్యంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు టిడిపికే పట్టం కట్టారు. టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి గెలుపొందారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసిపి అభ్యర్థి స్వల్ప మెజార్టీ సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ వైసిపి స్వల్ప మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరి రెండు ఎలిమినేషన్లలో టిడిపి అభ్యర్థి విజయ తీరాలకు చేరుకున్నారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,687 ఓట్లు పోలయ్యాయి. 11 రౌండ్లలో జరిగిన తొలి ప్రాధాన్యత లెక్కింపులో 19,239 ఓట్లు అనర్హమైనవి తొలగించారు. మిగిలిన 2,26,448 ఓట్లను లెక్కించారు. 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా చివరి వరకు ముగ్గురి మధ్యే ప్రధానంగా ఓట్ల పంపిణీ జరిగింది. వైసిపి, టిడిపిలకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డికి 95,659, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. దీంతో, వైసిపి అభ్యర్థికి 1,820 ఓట్ల మెజార్టీ లభించింది. అయితే, మేజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన ఓట్లు సాధించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించారు. చివరకు టిడిపి అభ్యర్థికి 1,09,781 ఓట్లు, వైసిపి అభ్యర్థికి 1,02,238 ఓట్లు వచ్చాయి. దీంతో, 7,543 ఓట్లతో రాంగోపాల్‌రెడ్డి గెలుపొందారు. పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు 20.188 ఓట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.

  • రీ కౌంటింగుకు వైసిపి పట్టు...

ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత రీ కౌంటింగ్‌కు వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పట్టుబట్టారు. అలా చేయడానికి వీల్లేదని ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి చెప్పడంతో చేయాల్సిందేనంటూ కౌంటింగ్‌ కేంద్రం ఆవరణలో ఆయన బైటాయించి నిరసన తెలిపారు. శనివారం నాడు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే వైసిపి నాయకులు కౌంటింగ్‌లో ఏదొక వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. గురువారం రాత్రి కొంతమంది యువకులను తీసుకొచ్చి ఎటువంటి కారణం లేకుండానే ఘర్షణకు దిగారు. దీంతో, వారిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి టిడిపి నాయకులను అనుమతిస్తున్నారంటూ వైసిపి అభ్యర్థి శుక్రవారం వివాదాన్ని రేపేందుకు ప్రయత్నించారు. శనివారం నాడు కౌంటింగ్‌ తరువాత తిరిగి రీకౌంటింగ్‌ చేయాలంటూ ఆందోళనకు దిగారు. రీ కౌంటింగ్‌కు కలెక్టర్‌ అంగీకరించలేదు. ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.

  • ఉత్తరాంధ్రలో...

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది. ఆ పార్టీ తరుఫున బరిలోకి దిగిన వేపాడ చిరంజీవిరావు విజేతగా నిలిచారు. మొదటి ప్రాధాన్యతలో ఓట్లలో ఎనిమిది రౌండ్లలోనూ ఆధిక్యం కనబరిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,89,214 ఓట్లకుగానూ 2,01,335 పోలయ్యాయి. వాటిలో 12,318 ఓట్లు చెల్లలేదు. 1,89,017 ఓట్లు చెల్లాయి. టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 82,957 ఓట్లు (43.89 శాతం) మొదటి ప్రాధాన్యంలో వచ్చాయి. ప్రధాన ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు (29.43 శాతం), పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు 35,954 ఓట్లు (18.49 శాతం) పోలయ్యాయ. వైసిపిపై టిడిపి అభ్యర్థి చిరంజీవిరావు 28,208 ఓట్ల మెజారిటీ సాధించారు. రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించాక టిడిపి అభ్యర్థికి 94,509 ఓట్లు, వైసిపి అభ్యర్థికి 59,673 ఓట్లే లభించాయి.

  • తూర్పు రాయలసీమలో... పట్టభద్రుల ఎంఎల్‌సిగా కంచర్ల శ్రీకాంత్‌

తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశాం-నెల్లూరు - చిత్తూరు జిల్లాలు) పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలుపొందారు. గురువారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమై. శనివారం తెల్లవారుజామున రెండు గంటల వరకూ కొనసాగింది. ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ప్రక్రియతో వైసిపి మద్దతుదారు శ్యాంప్రసాద్‌రెడ్డి పేర్నాటిపై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్‌ గెలుపొందారు. మొత్తం 2,48,360 ఓట్లకుగాను కంచర్ల శ్రీకాంత్‌కు 1,24,181 ఓట్లు, శ్యాంప్రసాద్‌ రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి.