Aug 18,2022 22:01
  • త్వరలో అన్ని శాఖల్లో అమలు
  • పరికరాలు ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాల పట్టు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సొంత మొబైల్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. 15 రోజుల పాటు ఇందులో వచ్చే ఇబ్బందులను పరిశీలిస్తామని ఉపాధ్యాయు సంఘాల నాయకులతో చెప్పారు. వ్యక్తిగత మొబైల్‌ నుంచి కాకుండా ప్రభుత్వం పరికరాలు అందజేస్తేనే యాప్‌ ద్వారా హాజరు వేస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రితో చెప్పారు. విద్యాశాఖలో నెలకొన్న ఉపాధ్యాయుల హాజరు సమస్యపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి గురువారం తన క్యాంపు కార్యాలయంలో విజయవాడలో చర్చించారు. సొంత మొబైల్‌లో హాజరు వేయడం వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం కలుగుతుందని మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హాజరు పరికరాలను ప్రభుత్వం ఇస్తేనే హాజరు వేస్తామన్నారు. విద్యా సంస్కరణల్లో ఉపాధ్యాయులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కాబట్టి పరికరాలు అందించాలని నాయకులు చెప్పారు. అవసరమైతే పాఠశాలలకు మొబైల్‌ ఫోన్లు తీసుకురాబోమని తెలిపారు. ప్రభుత్వం పరికరాలు ఇవ్వాలంటే సుమారు రూ.44 కోట్లు ఖర్చవుతుందని, ఈ బడ్జెట్‌ ఖర్చు చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదని మంత్రి చెప్పారు. ఈ హాజరు ఒక్క విద్యాశాఖలోనే కాదని, మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 30వ తేది వరకు ఈ యాప్‌ను ఉపయోగించాలని, అప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోమన్నారు. ఈ సమయంలో ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులను పరిశీలిస్తామన్నారు. వీటిపై ఈ నెల 28, 29 తేదిల్లో మరోసారి చర్చిద్దామని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన పలు అంశాలపై విద్యాశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 15వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల్లో పనిచేస్తును ఉపాధ్యాయులు సెలవు పెడితే పక్క పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చే ఉపాధ్యాయుడు అక్కడి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యాశాఖ అధికారులు హామీనిచ్చారు. ఈ చర్చల్లో పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం, ఐటీ సెల్‌ ఎడి శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎపిటిఎఫ్‌ 257 అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ మంజుల, సాల్మన్‌ రాజు, ఎస్‌టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌ సాయి శ్రీనివాస్‌, హెచ్‌ తిమ్మను, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు వి శ్రీనివాస్‌ ఎపిటిఎఫ్‌ 1938 ప్రధాన కార్యదర్శి చిరంజీవులు, పిఆర్‌టియు జి శివరామకృష్ణ, ఆప్టా కార్యదర్శి సత్యనారాయణ, డి పిఆర్‌టియు నాయకులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.