Sep 25,2021 11:38

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం నివురుగప్పిన నిప్పులా రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ అధిష్టానం కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) శనివారం భేటీ కానుండటం, అంతకుముందురోజే ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సీనియర్ల అసంతృప్తి...
పార్టీలోని కొందరు సీనియర్లు, రేవంత్‌ నియామకాన్ని వ్యతిరేకించిన మరికొందరితో రేవంత్‌, ఆయన టీంకు చిన్నపాటి ఘర్షణే రగులుకుంటోంది. సీనియర్ల మాటలను పరిగణనలోకి తీసుకుంటానని అంటూనే రేవంత్‌ తన పని తాను చేసుకుంటూపోతున్నారంటూ.. సీనియర్ల నుండి విమర్శలస్తున్నాయి. ప్రతి విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు బయటకు చెప్పాలని, తమతో మాట్లాడిన తర్వాతే కేడర్‌లోకి వెళ్లాలని సీనియర్లు భావిస్తుంటే.. రేవంత్‌ దూకుడు మాత్రం ఆ కోణంలో వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఘర్షణలు రాజుకుంటున్నాయి. రేవంత్‌ మినహా పార్టీ ఎంపి లు, సీతక్క మినహా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎమ్మెల్సీతోపాటు పలువురు సీనియర్‌ నాయకులు.. టీపీసీసీ అధ్యక్షుడి తీరుపై అసంతఅప్తితో ఉన్నారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో చోటుచేసుకుంటోంది. జగ్గారెడ్డి లాంటి కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నా.. మిగిలిన వారంతా రేవంత్‌ తీరుపై అసంతఅప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ నిర్వహణ సీనియర్లు వర్సెస్‌ రేవంత్‌ అన్నట్లుగా సాగింది.

రేవంత్‌ వ్యాఖ్యలకు.. తీరుకు పొంతనే లేదు : సీనియర్లు
ఈ ఏడాది జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా పార్టీలోని సీనియర్‌ నేతలందరినీ ఇళ్లకు వెళ్లి కలసి మరీ సయోధ్యకు రేవంత్‌ ప్రయత్నించారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌ బాధ్యతలు తీసుకునే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు, అధ్యక్షుడైన తర్వాత వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని చెప్పిన రేవంత్‌ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే అన్నీ తానే అనే ధోరణిలో పార్టీని తీసుకెళుతున్నారని సీనియర్లు వాపోతున్నారు.

అన్నీ ఆయనే ప్రకటిస్తే మేమెందుకు ? : సీనియర్లు
ఇంద్రవెల్లి సభకు ముందు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలకతో ప్రారంభమైన పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం, రావిర్యాల సభను అంతా రేవంత్‌ టీం నడిపించడం, మూడుచింతలపల్లి దళిత దీక్షలో కూడా సీనియర్లు తెరపైన కనిపించే పరిస్థితి లేకపోవడం, గజ్వేల్‌ సభ అంతా రేవంత్‌ అన్నట్లే సాగడాన్ని ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం పార్టీలో చర్చించకుండానే గజ్వేల్‌ సభలో 2 నెలల పాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించడం దేనికి సంకేతమని, అన్నీ ఆయనే ప్రకటిస్తే ఇక తాముండి ఎందుకనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

అధిష్టానానికి రేవంత్‌పై ఫిర్యాదు..
రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని కలసి రేవంత్‌ తీరుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం జగ్గారెడ్డి రేవంత్‌ను ఉద్దేశించి నేరుగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు స్థానిక కాంగ్రెస్‌ నాయకులకు సమాచారం లేకుండా రేవంత్‌ను కలవడం, కనీసం చర్చించకుండానే అధికార ప్రతినిధుల నియామక పేర్లు ప్రకటించడం, గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం లాంటివి రేవంత్‌ ఏకపక్ష ధోరణికి అద్దం పడు తున్నాయనేది సీనియర్ల విమర్శ. దీనిపై టీపీసీసీ ముఖ్యనేత పార్టీ అధిష్టానం నేత కేసీ వేణు గోపాల్‌కు లేఖ రాయడం కూడా తెలిసిందే.

కొత్త ఊపు వస్తే జీర్ణించుకోలేకపోతున్నారు : రేవంత్‌ టీం
కొందరు సీనియర్లు, రేవంత్‌ నియామకంపై వ్యతిరేకత ఉన్న నేతల వాదన ఒకలా ఉంటే... మరోవైపు రేవంత్‌ టీం కూడా పార్టీలో చురుగ్గానే వ్యవహరిస్తోంది. సీనియర్లు.. సీనియర్లు.. అంటూ ఏడేళ్లుగా పార్టీని పాతాళంలోకి తొక్కేశారని, రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తే దాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వారంటున్నారు. రేవంత్‌కు మొదటి నుంచీ అండగా ఉన్న నేతలు రేవంత్‌కు కవచంగా పనిచేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సీనియర్ల వ్యవహారశైలిని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. సీనియర్లతో మాట్లాడినా, మాట్లాడకపోయినా రేవంత్‌ నుంచి వచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేసే పనిలో వారు నిమగమైపోయారు. సీనియర్లు కొందరిని ఉసిగొల్పుతున్నారని, అధిష్టానం స్పష్టంగా చెప్పినా వారి వైఖరిలో మార్పురావడం లేదని పేర్కొంటున్నారు. రేవంత్‌ కూడా సమ యానికి అనుగుణంగా తన కార్యచరణను ముందుగానే ప్రకటించేస్తున్నారు. దండోరా నుంచి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ వరకు అన్ని విషయాలలో రేవంత్‌ పకడ్బందీగానే వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీనియర్లు తనకు అక్షింతలు వేస్తున్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతూనే.. వాటిని నెత్తిపై నుంచి దులిపేసుకుంటాననే రీతిలో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రేవంత్‌ను సమర్థిస్తోన్న పార్టీ అధిష్టానం..
పార్టీ అధిష్టానం కూడా రేవంత్‌ను సమర్థించే రీతిలోనే వెళుతోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌ అన్ని విషయాల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు రేవంత్‌కు సహకరించాల్సిందేనంటూ ముఖ్యనేతలందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు, బహిరంగంగా మరికొందరు చేస్తున్న వాదనలు నిలబడతాయా ? నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్‌ రాజకీయాలలో ఏ మార్పులు చోటుచేసుకుంటాయి ? వేచి చూడాలి మరి.