
-భారీగా మోహరించిన పోలీసులు, అరెస్టులు
ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా):రాజధానిలో అరెస్టులకు, నిర్బంధానికి పోలీసులు బుధవారం పాల్పడ్డారు. 144 సెక్షన్, పోలీస్ యాక్టు 30 అమలులో ఉన్నాయంటూ నిరసనకారులపై ఉక్కు పాదం మోపారు. ఆర్5 జోన్‌కు వ్యతిరేకంగా బుధవారం తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో 48 గంటల దీక్షకు జై భీమ్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ పిలుపివ్వడం, మరోవైపు వైసిపి నేతలు పేదలకు సెంటు స్థలం పంపిణీకి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించడంతో ఎలాంటి నిరసనలకూ అనుమతి లేదని, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉదయం ఏడు గంటలకే భారీ సంఖ్యలో తుళ్లూరు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు. శిబిరానికి ఎవరూ రావద్దంటూ తాళ్లను అడ్డుగా ఉంచారు. శిబిరానికి సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద ఉన్న జడ శ్రావణ్ కుమార్‌తోపాటు కొంతమంది న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రావణ్ కుమార్ అరెస్టును నిరసిస్తూ దీక్షా శిబిరంలో నిరసనకు దిగిన అమరావతి బహుజన జెఎసి కన్వీనర్ చిలకా బసవయ్యను, రైతులను, మహిళా రైతులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. ఈ తోపులాటలో కిందపడిపోయిన ఒక మహిళకు గాయాలయ్యాయి. పోలీసుల చర్యను తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు తీవ్రంగా ఖండించారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత జెఎసి నాయకులు పులి చిన్నాను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. వెలగపూడి, మందడం, వెంకటపాలెం తదితర రైతు దీక్షా శిబిరాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. 26న వెంకటపాలెంలో సిఎం సభ నేపథ్యంలో తమను భయపెట్టాలనే దుర్బుద్ధితో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారని రైతులు విమర్శించారు. తుళ్లూరు స్టేషన్‌కు తరలించిన వారిని పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. అరెస్టులను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి ఒక ప్రకటనలో ఖండించారు.