
బ్యాంకాక్ :థామస్ కప్.. పురుషుల బ్యాడ్మింటన్‌లో అత్యున్నతమైనదిగా భావించే ఈ కప్‌ను సాధించడం ఏ దేశపు క్రీడాకారులకైనా జీవిత కాలపు లక్ష్యం ! అయితే, అదేమంతా సులభం కాదు ! ఇండోనేషియా, చైనా, మలేషియాలను దాటి మరో దేశానికి ఆ కప్పు దక్కడమంటే అది అద్భుతమే! అందుకే, 73 ఏళ్ల నుండి భారత్‌ను థామస్ కప్ ఊరిస్తూనే ఉంది. ఈ సారి ఎలాగైనా సాధించి తీరాలన్నది భారత క్రీడాకారుల తపన ! దానికి తగ్గట్టుగానే టీమ్ ఇండియా కఠిన శిక్షణను తీసుకుంది. ఏడాది ముందునుండే ఈ శిక్షణ ప్రారంభమైంది. కరోనా కష్టకాలంలోనూ మన క్రీడాకారులు ఈ కఠోరా శిక్షణలో మునిగితేలారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతున్నా ఛాంపియన్‌గా దేశానికి తిరిగి రావాలన్నదే వారి లక్ష్యం! ఆ నమ్మకంతోనే బ్యాంకాక్‌కు వెళ్లినప్పటికీ ఏదో అనుమానం... అయితే, బరిలోకి దిగిన తరువాత మన క్రీడాకారులు చెలరేగి పోయారు. ఒక మ్యాచ్ తరువాత మరో మ్యాచ్‌ను గెలుపొందారు. మిగిలిన మ్యాచ్‌లు ఒక తీరు... ఫైనల్ మ్యాచ్ మరో తీరు ! ఫైనల్ ప్రత్యర్థి బ్యాడ్మింటన్ పవర్‌హౌస్ ఇండోనేషియా... అయినా.. జంకలేదు. విజయంపైనే దృష్టి! ఫలితం వరుస సెట్ల విజయం! కొత్త ఛాంపియన్ ఆవిర్భావం.
తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్, తొలి డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ, రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టారు. 3-0తో భారత్‌కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాలు కట్టబెట్టిన సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు ఫైనల్లో రాకెట్ పట్టాల్సిన అసవరం ఏర్పడలేదు. హెచ్.ఎస్ ప్రణరు హీరోయిక్స్‌తో ఫైనల్స్‌కు చేరిన భారత్.. ఫైనల్లో అతడి ఏకపక్ష విజయంతో రిటర్న్ గిఫ్ట్ అందించింది.
లక్ష్యసేన్ అదిరెన్ : ఫుడ్ పాయిజన్‌తో క్వార్టర్స్, సెమీస్‌లో నిరాశపరిచిన వరల్డ్ నెంబర్ 9, యువ షట్లర్ లక్ష్యసేన్ తుది వేటలో జూలు విదిల్చాడు. పూర్తి ఫిట్నెస్తో బరిలో నిలిచిన లక్ష్యసేన్ భారత్‌కు అదిరే విజయంతో తిరుగులేని ఆరంభాన్ని అందించాడు. మూడు గేముల పోరులో 8-21, 21-17, 21-16తో కండ్లుచెదిరే విజయం సాధించాడు. 65 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌ను లక్ష్యసేన్ చిత్తుగా కోల్పోయాడు. ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే ఇండోనే షియా షట్లర్ ఆంటోని గింటింగ్కు ముందంజ వేసే అవకాశం కల్పించాడు. దీంతో లక్ష్యసేన్ మరోసారి భారత్‌కు నిరాశ మిగిల్చేలా కనిపిం చాడు. ఎవరూ ఊహించని రీతిలో పుంజుకున్న లక్ష్యసేన్ వరుస గేముల్లో విశ్వ రూపం చూపించాడు. 11-7తో రెండో గేమ్‌లో విరామ సమయానికి ముందంజలో నిలిచిన లక్ష్యసేన్.. ఎక్కడా ఆధిక్యం కోల్పోలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ ఆరంభంలో వెనుకంజ వేశాడు. 8-11తో విరామ సమయానికి వెనుకంజలో నిలిచాడు. 12-12తో స్కోరు సమం చేసిన లక్ష్యసేన్..15-14, 18-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుసగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న లక్ష్యసేన్ మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌కు 1-0 ఆధిక్యం కట్టబెట్టాడు.
సూపర్‌హిట్టు : డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు తమ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించారు. 73 నిమిషాల ఉత్కంఠ పోరులో 21-18, 21-23, 21-19తో మెరుపు విజయాన్ని సాధించారు. ఇండోనేషియా జంట మహ్మద్ ఆషన్, కెవిన్ సంజయ జోడీపై కండ్లుచెదిరే విజయం సొంతం చేసుకున్నారు. 18-21తో తొలి గేమ్‌ను కోల్పోయిన తరుణంలో తెలుగు తేజం సాత్విక్‌సాయి ప్రదర్శన మ్యాచ్‌ను భారత్ వశం చేసింది. రెండో గేమ్ ప్రథమార్థంలో ముందంజలోనే కొనసాగిన సాత్విక్, చిరాగ్ జోడీ..14-14 అనంతరం వెనకడుగు వేసింది. వరుస పాయింట్లు కోల్పోయి 14-19తో మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో ముందుకొచ్చిన సాత్విక్‌సాయిరాజ్ ప్రత్యర్థిపై దాడి చేశాడు. వరుసగా నాలుగు మ్యాచ్ పాయింట్లను కాచుకుని సంచలన విజయం నమోదు చేశాడు. సాత్విక్‌పై పూర్తి నమ్మకం ఉంచిన చిరాగ్ శెట్టి.. తెలుగు షట్లర్‌కు తగిన సహకారం అందించగా సాత్విక్ పని పూర్తి చేశాడు. 17-20 నుంచి 23-21తో రెండో గేమ్‌ను గెల్చుకున్నారు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో గేమ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆధిక్యం చేతులు మారింది. 11-9తో విరామ సమయానికి ఆధిక్యంలో ఉన్న మనోళ్లు.. 13-16తో వెనుకంజలో పడిపోయారు. వరుస పాయింట్లతో 16-16తో స్కోరు సమం చేసిన సాత్విక్, చిరాగ్ జోడీ..18-18 వద్ద ప్రత్యర్థిని నిలువరించారు. ఒత్తిడిలో ప్రత్యర్థిని చిత్తు చేసి 21-19తో మూడో గేమ్‌ను, కెరీర్లో అతి పెద్ద మ్యాచ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డబుల్స్ అద్భుత విజయంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సూపర్ శ్రీకాంత్ : ఈ సీజన్లో జొనాథన్ క్రిస్టీ చేతిలో రెండు సార్లు ఓటమిచెందిన కిదాంబి శ్రీకాత్.. చారిత్రక సమరంలో చాంపియన్ ఆటతీరు ప్రదర్శించాడు. 21-15, 23-21తో వరుస గేముల్లోనే గెలుపొందాడు. 48 నిమిషాల రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌కు ఎదురులేదు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో చెమటోట్చాడు. టైబ్రేకర్‌కు దారితీసిన మ్యాచ్‌లో 23-21తో పైచేయి సాధించాడు. 3-0తో భారత్ థామస్ కప్ ఫైనల్లో ఇండోనేషియా మెడలు వంచి చారిత్రక విజయం సాధించింది.