Aug 18,2022 07:01

పదవ తరగతి చదువుతున్న అద్విక్‌, కృతిన్‌, అంకిత్‌లు బడి నుంచి ఇంటికి వెళుతున్నారు. ముగ్గురూ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కూర్చున్న బస్‌స్టాప్‌ దగ్గర ఓ వ్యక్తి ఉన్నారు. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్లో వాటర్‌ తాగి, పక్కన ఉన్న కాల్వలో విసిరివేశాడు. అది అద్విక్‌ చూశారు. తన స్నేహితులకు చూపించారు.
'చూస్తుంటే ఆ అంకుల్‌ ఉద్యోగస్తుడిలా వున్నాడు. కొంచెం దూరంలోనున్న కుప్పతొట్టిలో వెయ్యకుండా, మురికి కాలువలో వెయ్యడం తప్పు కదా' అన్నాడు అద్విక్‌.
'అవును. ప్లాస్టిక్‌ డబ్బాలు అడ్డుపడి మురికి కాల్వలోని నీరు రోడ్డు మీదకు పారుతుంది' అన్నాడు కృతిన్‌.
'మున్సిపాలిటీ వారు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాన్ని తొలగించేందుకు ఎక్కువ శ్రమ పడవలసి వస్తోంది. ఆయన చేసిన ఈ పనిని చూసి, చిన్నవాళ్లు నేర్చుకుంటారన్న జ్ఞానం కూడా లేదు. ఎలాగైనా ఆయన చేసిన తప్పును తెలియజేయాలి' అన్నాడు అంకిత్‌.
'నాకొక ఆలోచన కలిగింది. మీరంతా ఇక్కడే ఉండండి' అంటూ వెళ్ళాడు కృతిన్‌.
తన పుస్తకాల బ్యాగు ఆ వ్యక్తి పక్కన పెడుతూ 'అంకుల్‌ ఈ సంచి చూస్తూ వుండండి' అని చెప్పాడు. సరే బాబు అంటూ తల ఆడించాడు అతడు.
మురికి కాలువలో తేలుతున్న ప్లాస్టిక్‌ బాటిల్‌ తీసి పక్కనున్న కుప్పతొట్టిలో వేసాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. 'అంకుల్‌! నా బ్యాగులో వాటర్‌ బాటిల్‌ ఉంది. తీసి ఇవ్వరూ! చేతులు కడుక్కోవాలి' అని అడిగాడు.
అతను కృతిన్‌ చేసిన పని చూసి ఆశ్చర్యపోతూ, ఆలోచిస్తూ వాటర్‌ బాటిల్‌ తీసి ఇచ్చాడు. కృతిన్‌ చేతులు కడుక్కొని, బ్యాగు తగిలించుకుంటూ 'థ్యాంక్స్‌' అంకుల్‌ బ్యాగు చూసినందుకు అని వెళ్లిపోయాడు. కాని అతను మాత్రం తాను చేసిన తప్పును తెలుసుకుని తలదించుకున్నాడు.
- ఓట్ర ప్రకాష్‌ రావు 97874 46026