Aug 05,2022 18:32

టెహ్రాన్‌ :  వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌ లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే మాటిమాటికీ ఆమె పక్క సీటువైపుకి చూస్తూ.. కన్ను గీటుతుంటుంది. తర్వాత గ్రీనరీ ఉన్న ప్రదేశానికి చేరుకుని మాగ్నమ్  ఐస్‌ క్రీమ్‌ కొరుకుతున్నట్లు చూపించారు.  యువతి వస్రధారణను ఐస్‌క్రీమ్‌తో పోల్చుతూ మరో యాడ్  రూపొందించారు. ఈ ప్రకటనలతో  మహిళల విలువను తగ్గించారని ఇరాన్‌ సాంస్కఅతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్‌ మత శాఖ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ యాడ్‌ చేసిన డోమినో కంపెనీపై కేసులు పెట్టాలని ఇరాన్‌ లోని మతగురువులు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళల విలువలకు అవమానంగా ఈ యాడ్‌ ఉందని అక్కడి మతగురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని రకాల వాణిజ్య ప్రకటనలలో మహిళలు నటించడంపై నిషేధాన్ని విధించాయి. ఈ మేరకు అన్ని థియేటర్స్‌, యాడ్‌ ఎజెన్సీలకు అక్కడి ప్రభుత్వం లేఖలు రాసింది. హిజాబ్‌, మత పవిత్రత నియమాలను ధిక్కరిస్తున్న నేపథ్యంలో మహిళలు ఇకపై ప్రకటనల్లో నటించడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది. 1979 ఇస్లామిక్‌ విప్లవం తరువాత అయతొల్లా రుహెల్లా ఖోమేనీ మహిళలు చాదర్‌ ధరించాలని ఆదేశించారు. అప్పటి నుండి ఇరాక్‌ మహిళలకు హిజాబ్‌ తప్పనిసరి అయింది. గత రెండేళ్లలో హిజాబ్‌ ధరించడాన్ని ధిక్కరించిన మహిళలను అక్కడి ప్రభుత్వం నిర్భంధించిన సంగతి తెలిసిందే.