May 25,2023 21:20

న్యూయార్క్‌ : భారత్‌కు చెందిన ముగ్గురు ఐక్యరాజ్య సమతి శాంతి పరిరక్షకులకు మరణానంతరం డాగ్‌ హమర్స్క్‌ జోల్డ్‌ మెడల్‌ను అందచేయనున్నారు. గురువారం ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందచేయనున్నారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుళ్లు శిశుపాల్‌ సింగ్‌, సామ్‌వాలి రామ్‌ విష్ణోరుతో పాటు షబెర్‌ తెహార్‌ అలీకి ఈ అవార్డును ప్రకటించారు. వీరు ముగ్గురు ఐరాస శాంతి మిషన్‌ తరుపున వివిధ దేశాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ మృతి చెందారు. శిశుపాల్‌ సింగ్‌, సామ్‌వాలి రామ్‌ విష్ణోరు కాంగోలో మరణించగా, షబెర్‌ తాహెర్‌ ఇరాక్‌లో మరణించారు. అసాధారణమైన ధైర్యం, కర్తవ్య నిర్వహణ పట్ల అంకిత భావం, ప్రపంచ శాంతి కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని ఐరాస శాంతి పరిరక్షకులకు ఈ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని అంద చేస్తారు. ప్రతీ ఏటా మే 29న ఐక్యరాజ్య సమతి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు.