Jul 26,2021 15:19

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. పోటీలో పాల్గనే అథ్లెట్లు పోడియంలో ఫొటోల కోసం 30 సెకండ్ల పాటు మాస్క్‌ను తీయవచ్చని మినహాయింపునిచ్చారు. ఈ మినహాయింపు అథ్లెట్లు  పతకం గెలిచేందుకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే అథ్లెట్లు భౌతిక దూరం పాటిస్తూ.. 30 సెకన్ల పాటు ఫొటోల కోసం మాస్క్‌ను తొలగించవచ్చని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రతినిధి మార్క్‌ అడమ్స్‌ తెలిపారు. దీంతో వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని, అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధనను దుర్వినియోగం చేయవద్దని, ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయని సూచించారు. కాగా, అథ్లెట్లు శిక్షణ సమయంలో, ఆహారం తీసుకునే సమయంలో పోటీ సమయంలో, నిద్రించే సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో మాస్క్‌లు తొలగించకూడదనే కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. అలాగే ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో గేమ్స్‌తో సంబంధం ఉన్న 153 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని, 85శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు.