Jul 29,2021 18:53

38 ఏళ్ల వయసులోనూ తన పంచ్‌ పవర్‌ సత్తాను చాటాలని ప్రయత్నించిన మేరీకోమ్‌ ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమిని చవిచూసింది. ఓటమి భారంతో బాక్స్‌ రింగ్‌లోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లో వలెన్షియాను ఓడించిన మేరీకోమ్‌ ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్లో ఆమె చేతిలోనే ఓటమి చెందాల్సి వచ్చింది. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌ వలెన్షియానే కావడం గమనార్హం. 51 కిలోల విభాగంలో.. మేరీ కోమ్‌, కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్‌ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. వీరిద్దరి మధ్య పోరు ఆరంభమవ్వగానే.. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు పాయింట్ల కోసం శ్రమిస్తూ.. పిడిగుద్దుల వర్షం కురింపించసాగారు. మొదటి రౌండ్‌లో వలెన్షియా ఆధిక్యం సాధించుకుంది. జడ్జీలు మేరీకోమ్‌కు 46 పాయింట్ల ఇవ్వగా.. వలెన్షియాకు 49 పాయింట్లు కేటాయించారు. ఆ తర్వాత రెండు రౌండ్లలోనూ తన అనుభవాన్ని ఉపయోగించి విజృంభించినా.. చివరకు వలెన్షియాకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో మేరీకోమ్‌ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో పరాజయం చవిచూసింది. బహుశా ఇక మేరీకోమ్‌ కెరీర్‌ ముగిసినట్టే!

meri come