
వేతనాలు పెంచేవరకు షూటింగులకు హాజరుకాబోమని బుధవారం సినీకార్మికులు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులు, నిర్మాతల మండలి వేర్వేరుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కృష్ణయాదవ్ను కలిశారు. ఇరువైపులా సమస్యలు ఉన్నాయని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతల మండలి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. శుక్రవారం నిర్మాత మండలి అధ్యక్షులు దిల్ రాజు అధ్యక్షతన జరగనుంది. గురువారం కార్మికులు, చిత్రనిర్మాతలు జరిపిన చర్చల అనంతరం.. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. 'కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తరువాత జీతాలపై క్లారిటీ వస్తుంది. ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా జీతాలు అందజేస్తాం. శుక్రవారం నుంచి యథావిధిగా షూటింగులు జరుగుతాయి.' అని తెలిపారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ 'వేతనాల సమస్యపై మీటింగు పెట్టుకున్నామని, వేతనాలు పెంచేందుకు ఛాంబర్ సభ్యులు ఒప్పుకున్నారని అన్నారు. పెంచిన జీతాలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని' చెప్పారు.