
ట్రాన్స్‌జండర్లు సమాజంలో ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారు. వాటన్నిటిని దాటుకుని ఎంతో మంది లాయర్లుగా, టీచర్లుగా, వైద్యులుగా ఎదిగి స్ఫూర్తిగా నిలిచారు. ఈ వరసలో ఇప్పుడు డాక్టర్ రూత్ జాన్ పాల్, పాచీ రాథోడ్ చేరారు. కష్టపడి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వైద్యవృత్తి చేపట్టి చాలా ఏళ్లయింది. కాని వారిని వైద్యులుగా అంగీకరిస్తూ వారి సేవలు పొందేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదు. ఎన్నో అవమానాలు, అవహేళనలూ ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలకుండా జనానికి వైద్యాన్ని అందిస్తూనే ఉన్నారు. తోటి ట్రాన్స్జండర్లకు అండగా నిలిచి వైద్యసేవలు చేశారు. వీరి సేవలను గుర్తించి తెలంగాణా ప్రభుత్వం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులుగా నియమించింది.
తెలంగాణ, ఖమ్మంకు చెందిన రూత్ జాన్‌పాల్ 'మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్' కాలేజీలో 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో చాలా ఆసుపత్రుల్లో ప్రయత్నం చేసింది. కాని వెళ్లిన ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే కారణం చెప్పారు. 'మీరు ట్రాన్స్‌జెండరు... మీరు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిస్తే.. మా ఆసుపత్రికి జనం రావడం మానేస్తారు'. అని. రూత్ జాన్ పాల్ నిరాశపడకుండా ఉద్యోగం కోసం 15 ఆసుపత్రులను సంప్రదించారు. అన్నిటా ఒకటే అనుభవం. నిరాకరణ.
ఆదిలాబాద్‌కు చెందిన ప్రాచీ రాథోడ్ కూడా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాని కొన్ని రోజుల తర్వాత ఆ యాజమాన్యం 'మీ వల్ల మా ఆసుపత్రికి రోగులు రావడం లేదు. మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నాం' అని చెప్పింది. రిమ్స్ కళాశాల్లో చదువు పూర్తి చేసుకున్న ఈమె చిన్నప్పటి నుంచీ ఎన్నో అవమానాలు భరించారు. అయినా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందనుకున్నారు. శ్రద్ధ పెట్టి ఎంబిబిఎస్ చదివారు. తమ ప్రవర్తన నచ్చక స్నేహం చేసేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. కాని ఏకాగ్రతతో పట్టుదలగా చదువుకునేవారు.
ఇటువంటి అవహేళనలు వారికి చిన్నప్పటి నుంచీ అలవాటే. వీరు తమ పిల్లలే అని చెప్పుకునేందుకే తల్లిదండ్రులే ముందుకు రావడం లేదు. బంధువులు, తెలిసిన వారి ప్రేమానురాగాలకు నోచుకుని వీరు- రోగులే తమ కుటుంబసభ్యులుగా భావించాలనుకున్నారు. కాని వారే అయిష్టం చూపటంతో మనుసులు నొచ్చుకున్నాయి. వీరు జనానికి వైద్యం అందించాలన్న కోరికతో కష్టపడి ఎంబిబిఎస్ పట్టా పొందారు. అందులో నైపుణ్యం సాధించాలంటే ఏదో ప్రయివేటు ఆసుపత్రిలో కొన్ని నెలలు సర్వీసు చేయాలి. అందుకు కూడా ఎక్కడా వారికి అవకాశం దొరకలేదు. చాలా బాధపడ్డారు. సమాజానికి వైద్యసేవ చేయాలని, అందరిలా తాము డాక్టర్లగా గుర్తింపు పొందాలని ఎంతో ఆశతో కళాశాల నుంచి బయటకు వచ్చారు. కాని సమాజంలో వారి గుర్తింపు, తమ పట్ల ఉన్న చిన్నచూపు వారిని ఎంతో కుంగదీసింది. ప్రభుత్వ అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. రిజర్వేషను కల్పించి, ప్రోత్సహించాలని కోరారు.
ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత రూత్ జాన్ పాల్, రాథోడ్ జీవనోపాధి కోసం నారాయణగూడలోని యుఎస్ఎఐడికి చెందిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ 'మిత్రా'లో చేరారు. కాని అక్కడ ట్రాన్స్జెండర్లకు చెందిన శస్త్రచికిత్సలు మాత్రమే జరిగేవి. కాని తోటి ట్రాన్స్జండర్లో మనోధైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ చేసేవారు. శస్త్రచికిత్సలూ చేశారు. కానీ వారిలో ఎప్పుడూ అసంతృప్తి ఉండేది. మామూలు జనానికి వైద్యం అందించే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. థర్డ్ జెండర్‌ను గుర్తించి, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల అడ్మిషన్లలో రిజర్వేషన్లు మంజూరు చేయాలని 2014లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రూత్ జాన్ పాల్, రాథోడ్‌లు రెండేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగాలు పొందారు. 'భవిష్యత్తులో రోగులు కూడా మా పట్ల వివక్ష చూపించొచ్చు, కానీ ఎప్పుడైతే మెరుగ్గా వైద్యం అందిస్తామో, అప్పుడు వారిలో మార్పు వస్తుంది. మేమే కావాలని పేషెంట్స్ కోరుకునేలా కృషి చేస్తాం' అని రూత్, ప్రాచీ అంటున్నారు. ఈ విజయం వీరి ఒక్కరిదే కాదు. తమలాగా సమాజంలో బహిష్కరణకు గురవుతున్న ట్రాన్స్‌జండర్లు అందరిదీ!