Feb 03,2023 21:35
  • వృద్ధులకు పెన్షన్‌
  • ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఎలు
  • ఒపిఎస్‌ పునరుద్ధరణ
  • ఉపాధి హామీలో 200 రోజుల పని

అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని, నిరుపేదలైన వృద్ధులకు పింఛను ఇస్తామనిహామీ ఇస్తూ సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన హామీ ఇచ్చింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం 15పేజీల ఎన్నికల ప్రణాళికను వామపక్ష సంఘటన విడుదల చేసింది. పాత పెన్షన్‌ పథకానిు తిరిగి ప్రవేశపెడతామని, ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఎలను పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. తొలగించబడిన 10,323 మంది టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని, గిరిజన మండలికి మరింత స్వయంప్రతిపత్తి కల్పిస్తామని కూడా ఎనిుకల ప్రణాళిక వాగ్దానం చేసింది.
వామపక్ష సంఘటన కన్వీనర్‌ నారాయణ్‌ కర్‌ ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, 2018లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపురలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కివేసిందని విమర్శించారు. ''బిజెపి - ఐపిఎఫ్‌టి ప్రభుత్వ హయాంలో ప్రజల ఓటింగ్‌ హక్కులు కాలరాయబడుతున్నాయి. తమ వాణిని వినిపించేందుకు ప్రజలకు గల స్వేచ్ఛ హరించివేయబడుతోందని అన్నారు. ఎన్నికల్లో వామపక్ష సంఘటన గెలుపొందితే తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరిస్తామని నారాయణ్‌ కర్‌ చెప్పారు. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటనకు ప్రజలు పట్టం గడితే రాబోయే ఐదేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని వాగ్దానం చేశారు. మార్గదర్శకాల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరిస్తామనిచెప్పారు. 60ఏళ్లు దాటిన ఎవరికైనా, వార్షికాదాయం లక్ష లోపు వునుట్లైతే, వారికి సామాజిక పెన్షన్‌ లభిస్తుందనికర్‌ తెలిపారు. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యానిు ఏడాదికి రెండుసార్లు పెంచుతామని తెలిపారు. పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. త్రిపురలో 1,88,494 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వున్నారు. 50 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ అందిస్తామని పేర్కొన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహానిు అందించేందుకు ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి 200 రోజుల పనిదినాలను కల్పిస్తామని వామపక్ష సంఘటన వాగ్దానం చేసింది. త్రిపుర గిరిజన స్వయంప్రతిపత్తి ప్రాంతాల జిల్లా మండలి (టిటిఎఎడిసి)కి ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తిని కల్పిస్తామన్నారు. అవినీతి రహిత, ప్రజానుకూల ప్రభుత్వానిు అందించడానికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. 60స్థానాలును త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.