Aug 19,2022 13:15

హైదరాబాద్‌ : బిల్కిస్‌ బానో అత్యాచార దోషులు 11 మందిని విడుదల చేయడంపై మోడీ సర్కార్‌ తీరును విపక్షాలు, ప్రజా సంఘాలు ఎండగడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కూడా స్పందించారు. గతంలో ఈ ఘటనపై ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ట్వీట్లపై స్పందించిన బిజెపి నేతలు.. హైదరాబాద్‌లో మైనర్‌ బాలికపై కారులో అత్యాచారానికి పాల్పడిన నిందితులను మీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వారంతా బయటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే ఆ సిల్లీ ట్రోల్స్‌కు కెటిఆర్‌ ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. 'హైదరాబాద్‌ కేసులో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపాం. 45 రోజుల తర్వాత హైకోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ ఐపిసి, సిఆర్‌పిసిలో ఉన్న లసుగుల కారణంగా జుబ్లీహిల్స్‌ కేసులో రేపిస్టులు బెయిల్‌పై విడుదలయ్యారు' అని తెలిపారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని కెటిఆర్‌ డిమాండ్‌ చేశారు. అలా చేస్తే ఏ రేపిస్టుకు బెయిల్‌ లభించదని, దోషిగా తేలితే.. మరణించే వరకు జైలులోనే ఉండాలని బిల్కిస్‌ బానో కేసులో తన వైఖరిని పునరుద్ఘాటించారు.