
అంకారా : భూకంపాల ధాటికి టర్కీ, సిరియాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎటుచూసినా భవనాల శిథిలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 9,600 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టర్కీలో 7,108 మంది మరణించగా, సిరియాలో సుమారు 2,530 మంది మరణించినట్లు తెలిపింది. తీవ్రమైన మంచు కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని నేషనల్ డిజాస్టర్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో టర్కీ అధ్యక్షుడు రెసెపె తయ్యిప్ ఎర్డోగాన్ పర్యటించనున్నారు. ఆగ్నేయ టర్కీలోని పది ప్రావిన్స్‌లలో మూడునెలల ఎమర్జెన్సీని ప్రకటించారు.
20,000 మంది వరకు మరణించి ఉండవచ్చని డబ్ల్యుహెచ్‌ఓ అధికారులు అంచనా వేయడంతో.. మరణాల రేటు పెరగవచ్చనే భయాలు వెంటాడుతున్నాయని తెలిపింది. భూకంపాల ధాటికి 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని డబ్ల్యుహెచ్‌ఒ అంచనా వేసింది. ఈ రాష్ట్రాలకు సహాయం అందించాలని ప్రపంచ దేశాలను కోరింది. ఐరాసకు చెందిన యునెస్కో సాయానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.