May 04,2022 16:50

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి ట్విటర్‌ యూజర్లు రుసుము చెల్లించాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన అవుననే చెప్పారు. అయితే అందరి యూజర్ల నుండి కాదని, వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు మాత్రం స్వల్ప మొత్తంలో రుసుము చెల్లించాల్సి రావొచ్చు అని తెలిపారు. ఈ విషయాన్ని బుధవారం ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. దీనిపై ప్రస్తుత ట్విటర్‌ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ట్విటర్‌లో చాలా మార్పులు తీసుకురావాలని మస్క్‌ అనేక సూచనలు చేశారు. కొత్త ఫీచర్లతో పాటు ఆల్గారిథమ్‌ను ఓపెన్‌ సోర్స్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే బ్లూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పాలసీలోనూ మార్పులు తీసుకొస్తానని పేర్కొన్నారు. బహిరంగ కార్యక్రమంలో పాల్గన్న మస్క్‌ ట్విటర్‌పై భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. మీడియా, ఇంటర్నెట్‌లో తనపై విమర్శలు కొన్నిసార్లు తనకు బాధ కలిగిస్తాయన్నారు. తనకూ ఫీలింగ్స్‌ ఉంటాయని.. తానేమీ ఆండ్రాయిడ్‌ను కాదని ఛమత్కరించారు.