పదబయలు మావోయిస్టు రిక్రూట్మెంట్ కేసులో హైకోర్టు న్యాయవాది, ఇద్దరు సిఎంఎస్ నాయకుల అరెస్ట్

- వారి ఇళ్లల్లో ఎన్ఐఎ సోదాలు, కంప్యూటర్లు స్వాధీనం
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో హైకోర్టు న్యాయవాది చుక్కా శిల్ప, చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్నను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అరెస్ట్ చేసింది. విశాఖ జిల్లా పెదబయలు పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఎన్ఐఎ గురువారం తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సోదాలు నిర్వహించింది. ఘట్కేసరిలో నివాసముంటున్న దేవేంద్ర, హయత్ నగర్లో ఉంటున్న స్వప్న, ఖైరతాబాద్‌లో ఉంటున్న శిల్ప నివాసాల్లో గురువారం ఏకకాలంలో ఎన్ఐఎ సోదాలు జరిపింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లతో పాటు పలు పత్రాలను ఎన్ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన కుమార్తె రాధను కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పిఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధను సిఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో రాధను దేవేంద్ర తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల జూన్ మూడున ఎన్ఐఎకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తులో లభించిన కీలక ఆధారాల మేరకు ముగ్గురి ఇళ్లపై దాడి చేసి ముగ్గురినీ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.